
ఎన్నికల వేళ కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెడుతూ.. ఎత్తుకు పైఎత్తులేస్తోంది. హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో సోనియా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తాయని పార్టీ గట్టి నమ్మకంతో ముందుకువెళ్తోంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ ఆరు గ్యారెంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ఓ పథకం ప్రకారం ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే ఆరు గ్యారంటీ పథకాలు -నూరు గ్యారంటీ సీట్ల లక్ష్యంతో టీపీసీసీ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎన్నారైలకు ఎన్నికలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో తదితర అంశాలపై మార్గదర్శకం చేశారు.
కాంగ్రెస్ పార్టీ యువత, మహిళ, రైతులకు ఇవ్వబోయే వివిధ సంక్షేమ పధకాల గురించి వివరించారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల ATM కార్డు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వం రాగానే మెగా DSC ఏర్పాటు చేసి, ఏక కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగ భర్తీలు.. వంటి హామీలను వివరించారు. గల్ఫ్ సంక్షేమం బోర్డు – ఎన్నారై సెల్ ఏర్పాటుపై మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 50 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు ఆరు గ్యారెంటీల బ్యానర్లను ప్రదర్శించారు. కాంగ్రెస్ కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని ర్యాలీ లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు.
లండన్ మాదిరిగానే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి చేత కాంగ్రెస్ 6 గ్యారంటీలపై విస్తృత ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్ లో జరిగిన రాహుల్ బస్సు యాత్రకు విజయవంతం కావడంతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగిందని.. తాము ఖచ్చితంగా ఈసారి అధికారాన్ని చేపడతామని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో 6 గ్యారంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లి 100 సీట్లు గెలిచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఎన్నారైలతో విదేశాల్లో ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేయడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ హవా బలంగా విస్తోందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించడంతోపాటు ఇక్కడ ఉన్న తెలుగువారిని ప్రభావితం చేయవచ్చని కాంగ్రెస్ స్ట్రాటజికల్ గా ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..