బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం ఈ యేడు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. ఈ మేరకు అమ్మవారి కల్యాణానికి ముహూర్తం ఖరారు చేశారు. జూలై 5 వ తేదీన అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 5న అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా జులై 4వ తేదీన ఎదుర్కోళ్ళు, 5వ తేదీన కళ్యాణం, ఆరవ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు.
అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అమ్మవారి కళ్యాణం, బోనాలు ఇతర అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కల్యాణానికి నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. ఇక బోనాల పండుగలో ఎలాంటి తోపులాటలకు అవకాశం లేకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుందని మంత్రి తెలిపారు.