Telangana: అమిత్‌షా సభ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది తెలంగాణ బీజేపీ. 21వ తేదీన జరిగే సభను సక్సెస్ చేయాలని నేతలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. మునుగోడులో పార్టీ గెలుపు ఖాయమని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
ఇదిలాఉంటే.. పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెబుతున్న బీజేపీ నేతలు అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో పెద్దయెత్తున జనసమీకరణకు సిద్ధమయ్యారు. ఆదివారం మునుగోడులో అమిత్‌షా సభ ఉంటుంది. ఆ రోజు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారు. అమిత్‌షా సభ నేపథ్యంలో జనగామలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. దీనికి రాజగోపాల్‌రెడ్డి కూడా వచ్చారు.
బైపోల్‌లో పార్టీ గెలుపు ఖాయమని, బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒక్కటై పని చేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్. ఆ రెండు పార్టీల ఓట్లు బీజేపీకే పడతాయన్నారు. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలని, టీఆర్‌ఎస్ ఫాలోవర్లని విమర్శించారు. ఇక కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు బీజేపీ నేతలు. మోదీ వల్లే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆగిందన్న సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టారు డీకె అరుణ.
మరోవైపు జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజాసంగ్రామ యాత్ర 15వ రోజులు పూర్తి చేసుకుంది. యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ కోసం క్లిక్ చేయండి..