Bizarre: బాబోయ్ కోళ్ల దొంగలు.. రెండ్రోజుల్లో ఏకంగా 30 కోళ్లు మాయం.. రెక్కి నిర్వహించి మరీ..!

| Edited By: Shaik Madar Saheb

Jul 29, 2024 | 2:09 PM

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, రామగుండం సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రెండు రోజుల్లో దాదాపు 30 వరకు కోళ్లు దొంగతనానికి గురయ్యాయి. అర్థరాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోళ్లను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Bizarre: బాబోయ్ కోళ్ల దొంగలు.. రెండ్రోజుల్లో ఏకంగా 30 కోళ్లు మాయం.. రెక్కి నిర్వహించి మరీ..!
Chicken Theft Incidents
Follow us on

ఇంటికి కన్నాలు వేసే వారు… తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడే వారు… దారి దోపిడీ గాళ్లు… బ్యాంకులను, ఏటీఎంలను రాబరీ చేసే వారు… ఇలా ఎన్నో రకాల దొంగతనాలను చూశాం… కానీ అక్కడ మాత్రం వెరైటీ దొంగలు ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా కోళ్లను ఎత్తుకోపోయే వారు తమ హస్తలాఘవంతో చోరకళను ప్రదర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేపట్టి కోళ్ల దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, రామగుండం సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రెండు రోజుల్లో దాదాపు 30 వరకు కోళ్లు దొంగతనానికి గురయ్యాయి. అర్థరాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోళ్లను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

రెక్కి నిర్వహించి…

కోళ్లను చోరీ చేసేందుకు వచ్చిన ముఠా కూడా పకడ్భందీగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. రాబరీలు చేసేందుకు గ్యాంగులు  వ్యవహరించినట్టుగానే రెక్కి నిర్వహించి మరీ చోరీలకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. దొంగతనానికి ముందు ఓ కారులో కోళ్లను పెంచుతున్న ప్రాంతాల్లో సంచరించిన ముఠా రెక్కీ నిర్వహించి అదే రోజు రాత్రి వాటిని ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

కోళ్ల కోసం అంత శ్రమా..?

అయితే దేశీ కోళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకోవడం సహజమే. పల్లెల్లో ఆహారం కోసం తిరిగే ఇంటి కోళ్లను పిల్లులు ఎత్తుకెళ్లడం సాధారణంగా  వింటుంటాం. కానీ ఇక్కడ పెంచుతున్న కోళ్లకు స్పెషాలిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ ముఠా రెక్కి వేసి మరీ చోరీ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. కోళ్ల స్పెషాలిటీ ఏంటంటే… పందెం కోసం వాటి యజమానులు పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. సినిమాల్లో చూపించిన విధంగా కోళ్లకు ఇచ్చే దాణా అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. జీడిపప్పు, బాదం పిస్తా వంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇచ్చి ఈ కోళ్లను పెంచుతుంటారని తెలుస్తోంది. వీటిని సంక్రాంతి సమయంలో ఏపీలో జరిగే కోడి పందాల కోసం సిద్దం చేస్తున్నట్టుగా సమాచారం. ఉక్రోషం, పౌరుషం నింపి వాటిని పెంచినట్టయితే కాలికి కత్తికట్టి మైదానంలోకి దింపితే ప్రత్యర్థి కోడిని ఓడిస్తాయని భావిస్తుంటారు పందెంరాయుళ్లు. ఇందులో భాగంగానే పందెం కోళ్లను పెంచి పోషించేందుకు కేర్ తీసుకునే యజమానుల వద్ద కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు పందెం కాసేవాళ్లు. ఈ కోళ్ల కోసం ప్ర్యతేకంగా చొరవ తీసుకుని వాటి బలిష్టంగా  పెంచితేనే మార్కెట్లో ధర పలుకుతుందని యజమానులు కూడా భావిస్తుంటారు.

ధర ఎంతో తెలుసా..?

అయితే ఈ కోళ్లకు మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాట్నపల్లిలో చోరికి గురైన వాటిలో ఒక కోడికి రూ. 2 లక్షల వరకూ ధర పలుకుతుందని యజమాని చెప్పినట్టుగా సమాచారం. మిగతా వాటిలో ఒక్కో కోడికి రూ. 50 వేల వరకు ధర గిట్టుబాటు అవుతుందని తెలుస్తోంది. బ్రాహ్మణపల్లిలో చోరీకి గురైన ఒక్కో కోడి రూ. 50 వేల వరకు ధర పలుకుతుందని ప్రచారం జరుగుతోంది.

టీజీ టు ఏపీ…

సంక్రాంతి సందర్బంగా ఏపీలోకి కోస్తా జిల్లాల్లో జరిగే కోడి పందాలకు తెలంగాణ కోళ్లు తరలివెళ్తున్నాయన్న విషయం ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. పౌరుషంతో పెరిగే కోళ్లతో పాటు ఉక్రోషం, పౌరుషం కలగలిపి, బలవర్దకంగా తయారైన కోళ్లకు కూడా సంక్రాంతి సందర్బంగా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే మార్కెట్లో అత్యంత ఖరీదు పలుకుతున్న ఈ కోళ్లను తస్కరించిన దొంగలు సొమ్ము చేసుకోవాలని భావించారో లేక వాటిని తీసుకెళ్లి సంక్రాంతి పోటీలకు సిద్దం చేయాలనుకున్నారో తెలియదు కానీ పెద్దపల్లి జిల్లాల చోరీకి గురైన కోళ్ల వ్యవహారంపై సంచలనంగా మారింది. ఈ విషయంపై పోలీసులు కూడా సీరియస్ గా ఆరా తీసేందుకు రంగంలోకి దిగడంతో తమ కోళ్లు తమ చేతికి వస్తాయని యజమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి