తెలంగాణలోని వెనకబడిన తరగతులకు విద్యా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బీసీల పురోగతి, సమగ్రాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జూన్ ఒకటో తేదీ నుంచి 2031 మే నెల 31వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు రాబోయే పదేళ్ల కాలంలో జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అయిదేళ్ల వయో పరిమితి పెంపును కొనసాగించేందుకూ ఆదేశించింది. అందుకు అనుగుణంగా అన్ని సాధారణ, సేవా, ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వ శాఖలు సడలించాలని ఆదేశాలిచ్చింది. అన్ని శాఖలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ప్రస్తుతం బీసీలకు తెలంగాణలో 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా కేఎన్ అనంతరామన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి 1970 సెప్టెంబరులో బీసీలకు విద్యా, ఉద్యోగ నియామాకాల్లో పదేళ్లపాటు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా రిజర్వేషన్ల గడువు మే నెల 31తో ముగుస్తున్నందున బీసీ కమిషన్ కార్యదర్శి సిఫార్సుల మేరకు ప్రభుత్వం మరోసారి పొడిగింపు ఉత్తర్వులను ఇచ్చింది.
విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ వర్గాలకు మరో పదేళ్లపాటు రిజర్వేషన్లు వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2011 మే 1వ తేదీన బీసీ రిజర్వేషన్లను పదేళ్లు పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఈనెల 31వ తేదీతో ముగియనున్నాయి. దీంతో ఈ రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 112 బీసీ కులాలున్నాయి. 2014 ఆగస్టులో అనాథలను బీసీ (ఎ-గ్రూపు)జాబితాలో చేర్చారు. 2020 సెప్టెంబరులో సంచార జాతుల్లోని 17 కులాలనూ చేర్చడంతో ఈ సంఖ్య 130కి చేరింది. ఆ సామాజిక వర్గాలకు 2031 మే 31వ తేదీ దాకా విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు కానున్నాయి. బీసీల్లో బీసీ-ఏలకు ఏడు శాతం, బీసీ-బీలకు 10, బీసీ-సీలకు ఒక శాతం, బీసీ-డీలకు ఏడు శాతం, బీసీ-ఈలకు 4ు రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలవుతున్నాయి.
Read Also… Special Task Force: పిల్లల్లో కోవిడ్ చికిత్స విధానానికి 8 మందితో కూడిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్