AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Auction: బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

బ్యాంకు ఆక్షన్‌లో ఆస్తులు తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ, కొనుగోలుకు ముందు పలు డాక్యుమెంట్స్ పరిశీలన, ఆస్తి స్వాధీనం, పెండింగ్ బకాయిలు, బ్యాంకు నిబంధనల తనిఖీ అత్యవసరం. లీగల్ వెరిఫికేషన్ లేకుండా కొనడం ప్రమాదకరం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.

Bank Auction: బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు
Representative Image
Ravi Kiran
|

Updated on: Apr 17, 2026 | 11:17 AM

Share

బ్యాంకు వేలం ద్వారా తక్కువ ధరకు ఆస్తిని సొంతం చేసుకోవాలనే ఆశ చాలామందికి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో లాభాలతో పాటు అంతకంటే ఎక్కువ చట్టపరమైన ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీల కొనుగోలులో ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకులు సాధారణంగా ‘SARFAESI’ చట్టం 2002 కింద తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి రుణగ్రహీతల ఆస్తులను వేలం వేస్తాయి. వీటిని “యాజ్ ఈజ్ వేర్ ఈజ్”(As-is-where-is) ప్రాతిపదికన విక్రయిస్తాయి. అంటే ఆస్తి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే, దానిపై ఉన్న అన్ని బాధ్యతలతో సహా కొనుగోలుదారుడు స్వీకరించాల్సి ఉంటుంది.

ఈ కొనుగోలులో ప్రధానంగా ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఆస్తి స్వాధీనం. బ్యాంకు వేలం వేసినంత మాత్రాన పాత యజమాని లేదా అద్దెదారులు ఆస్తిని సులభంగా ఖాళీ చేస్తారని అనుకోలేం. వారు కోర్టులను ఆశ్రయిస్తే లేదా లీజు హక్కులను చూపిస్తే, కొనుగోలుదారుడు ఆస్తిని దక్కించుకోవడానికి సంవత్సరాల తరబడి న్యాయపోరాటం చేయాల్సి రావచ్చు. అలాగే, ఆస్తిపై ఉన్న పాత బకాయిలైన మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ ఛార్జీలను కొనుగోలుదారుడే భరించాలి.

మరో కీలకమైన అంశం ఏమిటంటే, బ్యాంకులకు కేవలం తమ రుణ రికవరీపైనే దృష్టి ఉంటుంది. ఆ ఆస్తికి సంబంధించిన గత 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో లేదా ఆ ఆస్తిపై ఏవైనా కుటుంబ వివాదాలు, భాగస్వామ్య తగాదాలు ఉన్నాయో లేదో బ్యాంకులు బాధ్యత వహించవు. ఒకవేళ బ్యాంకు వేలం ప్రక్రియలో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే లేదా పాత యజమానికి సరైన నోటీసులు ఇవ్వకుండా వేలం వేస్తే, ఆ వేలం రద్దయ్యే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో కొనుగోలుదారుడు కేవలం తాను చెల్లించిన అసలు మొత్తాన్ని, కొంత వడ్డీని మాత్రమే తిరిగి పొందుతారు. కానీ రిజిస్ట్రేషన్ ఖర్చులు, స్టాంప్ డ్యూటీ, అప్పటికే చేసిన ఇతర ఖర్చులు తిరిగి రావు.

బ్యాంకు వేలం ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు:

  • లీగల్ వెరిఫికేషన్: బ్యాంకు పత్రాలతో సంబంధం లేకుండా, మీరు సొంతంగా న్యాయ నిపుణుల ద్వారా 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు, టైటిల్ క్లియరెన్స్‌ను తనిఖీ చేయించాలి.
  • భౌతిక తనిఖీ: ఆస్తి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎవరైనా నివసిస్తున్నారా? అనేది స్వయంగా వెళ్లి పరిశీలించాలి.
  • పెండింగ్ బకాయిలు: ఆస్తిపై ఏవైనా పెండింగ్ పన్నులు లేదా బిల్లులు ఉన్నాయో లేదో ముందుగానే లెక్కించుకోవాలి.
  • వేలం ప్రక్రియ: బ్యాంకు అన్ని చట్టబద్ధమైన నిబంధనలను పాటించి వేలం నిర్వహిస్తోందో లేదో నిర్ధారించుకోవాలి.

తక్కువ ధరకు వస్తోంది కదా అని తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక నష్టాలు, మానసిక వేదన ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, సాధారణ ఆస్తి కొనుగోలు కంటే బ్యాంకు ఆక్షన్ ఆస్తుల విషయంలో రెట్టింపు జాగ్రత్తగా ఉండాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

ఇది చదవండి: హైదరాబాద్ టూ నరసాపురం.. పాస్టర్ ఇంటికి రెండు పే..ద్ద లగేజీలు.. ఓపెన్ చేయగా

Follow Us