
సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత భయంకరమైన, సంచలన ఘటన వెలుగుచూసింది. సంతకు వెళ్లి భర్తతో కలిసి బైక్‌పై తిరిగి వస్తున్న ఒక మహిళను గుర్తు తెలియని దుండగులు అడ్డుకుని, అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘోర ఉదంతం బొల్లారం పారిశ్రామికవాడలోని ఐడీఏ క్రీడా ప్రాంగణం వద్ద తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు,స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. బొల్లారం పారిశ్రామికవాడ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో అనిల్, మీనా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. శనివారం (మే 30) రోజు వీరిద్దరూ కలిసి స్థానికంగా జరిగే వారాంతపు సంతకు వెళ్లారు. అక్కడ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి, పనులు ముగించుకుని రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరారు.
వారి బైక్ ఐడీఏ క్రీడా ప్రాంగణం సమీపంలోకి రాగానే, అక్కడ మాటు వేసిన గుర్తు తెలియని కొందరు దుండగులు వీరి వాహనాన్ని అడ్డుకున్నారు. బైక్‌ను ఆపిన వెంటనే ఆ దుండగులు మీనాతో అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించారు. భార్య పట్ల మృగాళ్లలా ప్రవర్తిస్తున్న వారిని చూసి భర్త అనిల్ తీవ్రంగా ప్రతిఘటించాడు. వారిని వెనక్కి నెట్టి తన భార్యను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ గుర్తు తెలియని వ్యక్తులు తమ వద్ద దాచుకున్న కత్తితో అనిల్‌పై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
భర్తను గాయపరిచిన అనంతరం దుండగులు మీనాను బలవంతంగా పట్టుకున్నారు. ఆమె గట్టిగా కేకలు వేస్తున్నప్పటికీ వినకుండా, కత్తితో ఆమె గొంతు కోసి అక్కడికక్కడే అత్యంత ఘోరంగా హతమార్చారు. కట్టుకున్న భర్త కళ్లముందే భార్యను రక్తం మడుగులో ముంచేసి, ప్రాణాలు తీసి ఆ దుండగులు చీకట్లోకి పరారయ్యారు.
ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో, అపస్మారక స్థితిలో పడి ఉన్న అనిల్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ భయంకరమైన హత్య ఉదంతంపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు తక్షణమే క్షేత్రస్థాయికి చేరుకున్నారు. మీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను చికిత్స నిమిత్తం చేర్పించారు.
ఈ ఘటనపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. పలు కోణాల్లో పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానిక పారిశ్రామికవాడలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..