
తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ–వాయువ్య దిశలో కదిలి మరింతగా బలపడనుంది. మధ్య బంగాళాఖాతానికి చేరే క్రమంలో బలహీనపడనుంది. అటు బుధ, గురువారాల్లో వాయుగుండం దిశపై మరింత స్పష్టత లభించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శ్రీలంక–నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో మరొక అల్పపీడనం ఏర్పడింది. బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తర్వాతి 24 గంటల్లో ఇది కూడా వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందన్నారు. రెండు వాయుగుండాలు ఉత్తర తమిళనాడు తీరం దిశగా కదలనున్నాయని అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత కోస్తాంధ్ర వైపునకు చేరుకుని బలహీనపడనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 1న తెలంగాణలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో చలి తగ్గింది. మెదక్‌లో 13.8 డిగ్రీలు, పటాన్ చెరువులో 14.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 14.7 డిగ్రీలు, హయత్ నగర్‌లో 15 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 17 డిగ్రీలు, హనుమకొండలో 17.5 డిగ్రీలు, రామగుండంలో 17.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17.6 డిగ్రీలు, దుండిగల్‌లో 17.7 డిగ్రీలు, నల్లగొండలో 18.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 18.2 డిగ్రీలు, హకింపేట్‌లో 18.7 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 19.1 డిగ్రీలు, ఖమ్మంలో 20.4 డిగ్రీలు, భద్రాచలంలో 20.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీపై కూడా వాయుగుండం ప్రభావం పడనుంది. రేపటి నుంచి మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లినవారు వెంటనే తిరిగి ఒడ్డుకి రావాలని సూచించింది. వాతావరణ ప్రభావంతో నవంబర్ 29 – డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంది.