Telangana: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సంచలన ట్విస్ట్‌.. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!

| Edited By: Balaraju Goud

Nov 12, 2024 | 2:03 PM

నోటీసులు అందుకున్న మాజీ ఎమ్మెల్యేలే పోలీసుల సహాయంతో డబ్బుల సంచులను ఎన్నికలకు తరలించినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.

Telangana: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సంచలన ట్విస్ట్‌.. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
Phone Tapping Case
Follow us on

సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు రావడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చార్జిషీటు దాఖలు చేసినా నాలుగు నెలల తర్వాత ఈ కేసులో పొలిటికల్ లీడర్లను పోలీసులు టచ్ చేశారు. అయితే ఎమ్మెల్యేలకు ఫోన్ టైపింగ్ కేసుతో ఉన్న సంబంధాలపై సర్వత్ర చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో పోలీస్ అధికారులను మాత్రమే అరెస్టు చేశారు. మరో ఇద్దరు విదేశాల్లో తలదాచుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు పోలీసుల ముందుకు వచ్చి సహకరిస్తేనే ఇందులో రాజకీయ నాయకుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. అప్పుడే రాజకీయ నేతలను పోలీసులు విచారణకు పిలుస్తారు అని ముందు నుండి నడుస్తున్న వాదన. కానీ అనుహ్యాoగా ఆ ఇద్దరు విదేశాల్లోనే ఉన్నప్పటికీ పోలీసులు పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడూ సంచలనంగా మారింది.

అయితే ఫోన్ టాపింగ్ కేసులో అప్పటి ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ రెండో వారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే టాపింగ్ కేసు విచారణ సందర్భంగా అప్పటి ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును సీజ్ చేసే విషయంలో ఇప్పుడు అరెస్టు అయిన పోలీసుల పాత్ర ఉంది. వీటితోపాటు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పోలీస్ వాహనాల్లో డబ్బులు సైతం వెళ్ళినట్లు చార్జిషీట్లోనూ దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు నోటీసులు అందుకున్న మాజీ ఎమ్మెల్యేలే పోలీసుల సహాయంతో డబ్బుల సంచులను ఎన్నికలకు తరలించినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో వీరి స్టేట్‌మెంట్ రికార్డ్ తోపాటు వీరి పాత్ర పైనా పోలీసులు విచారించాల్సిన ఉంది. అందులో భాగంగానే వీరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. నవంబర్‌ 14వ తేదీన చిరుముర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరుకానున్నారు.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు సెలబ్రెటీలు, బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోగా.. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..