
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఉత్తర బీహార్ నుంచి జార్ఖండ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అలాగే దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు, యానంలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా మెరుపులు సంభవించే అవకాశం ఉండటంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. జూలై 19, 20 తేదీల్లో కూడా ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాయలసీమ ప్రాంతంలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలో కూడా జూలై 18న రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
జూలై 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అధికారులు సూచించారు.