Ande Sri Death: అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం..

తెలంగాణ తన ఒడిలోంచి ఓ స్వరాన్ని కోల్పోయింది.. చేనేత దారంలా మాటలను నేసిన రచయిత అందెశ్రీ ఇకలేరు.. ప్రముఖ రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం (64) కన్నుమూశారు. ఉదయం లాలాపేటలోని ఇంట్లో అందెశ్రీ కుప్పకూలారు. ఆయన్ను గాంధీ ఆస్పత్రికి.. తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

Ande Sri Death: అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం..
Ande Sri Death

Updated on: Nov 10, 2025 | 10:03 AM

తెలంగాణ తన ఒడిలోంచి ఓ స్వరాన్ని కోల్పోయింది.. చేనేత దారంలా మాటలను నేసిన రచయిత అందెశ్రీ ఇకలేరు.. ప్రముఖ రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం (64) కన్నుమూశారు. ఉదయం లాలాపేటలోని ఇంట్లో అందెశ్రీ కుప్పకూలారు. ఆయన్ను గాంధీ ఆస్పత్రికి.. తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్న రేవంత్.. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

కాగా.. అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎస్‌తో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అందెశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సీఎస్‌కు సూచించారు.

కేసీఆర్ సంతాపం

అందెశ్రీ మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

అందెశ్రీ మృతిపట్ల కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం తెలిపారు.

జయజయహే తెలంగాణ..

ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో జన్మించారు అందెశ్రీ. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతం రచించారు. ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. గత ఏడాది జూన్‌ 2న నిర్వహించిన తెలంగాణ ఏర్పాటు దినోత్సవంలో ఏమోషన్‌కు లోనయ్యారు అందెశ్రీ. తాను రాసిన పాట అధికారిక కార్యక్రమంలో వినిపిస్తుండగా తాను భావోద్వేగానికి లోనయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..