తెలంగాణలోని వరంగల్ చౌర్ బోళిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం పునాది తీస్తుండగా.. అమ్మవారి విగ్రహం బయటపడింది. చౌర్ బోళిలోని చక్రవర్తి హాస్పిటల్ వద్ద ఓని మణి అనే వ్యక్తికి చెందిన స్థలంలో కూలీలు పునాదుల తవ్వుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద రాతి విగ్రహం బయల్పడింది. ఇది గమనించిన వారు తవ్వకాలు నిలిపేసి యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో విగ్రహం బయటకి తీసి తీశారు. అది అమ్మవారి విగ్రహం అని నిర్ధారించుకుని.. ఆపై శుభ్రం చేశారు.
తన ఇంటి నిర్మాణం సందర్భంగా శుక్రవారం రోజున విగ్రహం బయటపడడంతో సాక్షాత్తు లక్ష్మీదేవే కరుణించారని ఇంటి యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అమ్మవారి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి, పూజలు చేశారు. విగ్రహాన్ని దర్శించుకొని పూలు, పండ్లు సమర్పిస్తున్నారు స్థానికులు. ఈ విగ్రహం అతి పురాతనమైందని.. విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ఆలయ నిర్మాణంపై గ్రామస్తులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్థానిక పెద్దలు తెలిపారు. ఈ విగ్రహం పురాతన శిల్పకళకు నిదర్శనమని పురోహితులు తెలిపారు.
మాములుగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన తవ్వకాలు జరిపినప్పుడు.. పురాతన నిధి.. నిక్షేపాలు బయటపడటం చూశాం. కానీ ఇలా దేవతల విగ్రహాలు బయటపడటం చాలా అరుదు అని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..