
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం కలుసుకుంది. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి ల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అటా ప్రతినిధులు డిసెంబర్ 27వ తేదీన జరగనున్న ఆటా వేడుకలు-2025 గ్రాండ్ ఫినాలేకు హాజరు కావాలని కోరారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే 2026 జూలై నెలలో అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో జరగనున్న అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహాసభలకు ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆటా చేపడుతున్న కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు, విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా విదేశాల్లోని తెలుగు యువతలో భాష, సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించడంలో ఆటా చేస్తున్న కృషిని తెలియజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆటా ప్రతినిధులను అభినందిస్తూ, తెలుగు భాషా పరిరక్షణకు, సంస్కృతి వికాసానికి ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఉప ముఖ్యమంత్రి భట్టి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని సహా తదితరులు ఉన్నారు.
అమెరికా డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్ కుటుంబానికి అమెరికా తెలుగు అసోసియేషన్ అండగా నిలిచింది. హైదరాబాద్ పర్యటనలో ఆటా ప్రతినిధులు చంద్రశేఖర్ తల్లిని కలుసుకుంది. కొడుకును కోల్పోయి దీనావస్థను అనుభవిస్తున్న కుటుంబం పరిస్థితులపై ఆటా బృందం ఆరా తీసింది. ధైర్యంగా మిగిలిన పిల్లలను చదివించుకుంటూ ముందుకు సాగుతున్న చంద్రశేఖర్ తల్లిని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సన్మానించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు అండగా ఉంటామని ఆటా బృందం హామీ ఇచ్చింది. గో ఫండ్ మీ ద్వారా సేకరించిన 50 లక్షల రూపాయలను త్వరలోనే ఈ కుటుంబానికి అందజేస్తామని ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా తెలిపారు.
Ata Business Seminar
అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో కీలక కేంద్రంగా హైదరాబాద్ మారిందని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అన్నారు. శుక్రవారం (డిసెంబర్ 19) హైదరాబాద్ టి హబ్ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ బిజినెస్ సెమినార్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి లారా విలియమ్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ పెట్టుబడిదారులు ఇప్పటికే అమెరికాలో 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారని లారా విలియమ్స్ వెల్లడించారు. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక నమ్మకం, భాగస్వామ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ వేగంగా అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఎదుగుతోందని లారా విలియమ్స్ ప్రశంసించారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ సాధించిన ప్రగతి ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం గల మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని ఆమె అన్నారు.
అలాగే ఐటీ పరంగా ఇన్నోవేటివ్ ఐడియాలకు కేంద్రంగా టి హబ్ మారిందని, స్టార్టప్‌లు, గ్లోబల్ కార్పొరేట్లు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే టి–హబ్ నమూనా దేశానికే ఆదర్శమని ఆమె అన్నారు. అదే విధంగా సైబర్ సెక్యూరిటీ, డేటా రక్షణ, కీలక మౌలిక సదుపాయాల భద్రతలో భారత్–అమెరికా సహకారం మరింత బలపడాల్సిన అవసరం ఉందని అమెరికా యుఎస్ కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ సూచించారు. ఆటా చేస్తున్న ప్రయత్నాలకు గాను, అమెరికా, భారతదేశాల మధ్య వారధిగా వ్యవహరిస్తున్న ఆటా సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..