
అంబులెన్స్ అంటేనే ప్రాణం కాపాడే దైవంతో సమానం. రోడ్లపై కుయ్.. కుయ్.. మంటూ శబ్దం వినిపిస్తే చాలు అయ్యో ఎవరికి ఏమైందో.. ఆ వాహనంలో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడో.. ఆ వ్యక్తి ప్రాణాలు నిలుపు భగవంతుడా అని కోరుకోవడం సహజం. ఇక, ఆ రోగి బందువుల పరిస్థితి మరింత దారుణం. క్షణం ఆలస్యమైనా ఆప్తులైన రోగి ప్రాణాలు గాల్లో కలుస్తాయని వేగంగా ఆస్పత్రికి చేర్చాలని అంబులెన్స్ డ్రైవర్లను దేవుడిలా వేడుకుంటారు రోగి బందువులు. కానీ మంచిర్యాల జిల్లాలో మాత్రం ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ డ్రైవర్లు ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి అలవాటు పడి రోగి బందువుల కు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి రోగి రావడమే ఆలస్యం క్షణాల్లో అక్కడ వాలిపోయి రోగి బందువులను బుట్టలో వేసుకుని భయపెట్టో.. బాధపెట్టో కమిషన్ ఇచ్చే ఆస్పత్రికి తరలిస్తారు. రోగి ప్రాణం నిలిచిందా కమిషన్ మరింత రాబట్టుకోవడం.. మరో రోగి కోసం గద్దల్లా వాలిపోవడం పరిపాటే అన్న తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఈ జిల్లా కేంద్రంలోని అంబులెన్స్ నిర్వహకులు.
మానవత్వాన్ని మర్చి.. కరోనా రోజుల నుండి కమిషన్లకు కక్కుర్తి..
అసలు ఈ దందాకు బీజం పడింది కరోనా సమయంలోనే..! కరోనా రాకతో రోగుల సంఖ్య విఫరీతంగా పెరగడం.. ప్రాణదాతలుగా మారి కరోనా రోగులను తరలించడంలో అంబులెన్స్ డ్రైవర్లు సాహసం చేయడంతో.. తమ ఆస్పత్రులకే రోగులు ఎక్కువగా రావాలనే అత్యాసతో అంబులెన్స్ డ్రైవర్లకు, యజమానులకు కమిషన్ల ఆశ చూపడంతో మొదలైన అంబులెన్స్ కం ఆస్పత్రుల దందా నేటి వరకు మూడు పువ్వులు ఆరుకాయాలుగా సాగుతూనే ఉంది. ఎంతలా అంటే కొన ఊపిరితో ఉన్న రోగిని, రోగి బందువుల నిర్ణయంతో సంబందం లేకుండా తమకు కమిషన్ లు ఇచ్చే ఆస్పత్రికి తరలించే అంతలా. తాజాగా ఓ యువతి బ్రెయిన్ డెడ్ కేసుతో ఈ దందా గుట్టు రట్టైంది.
లక్షేట్టిపేట ఘటనతో రట్టైన గుట్టు
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన మ్యాదరి సింధూజ అనే యువతి మార్చి 29 న రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సిందూజను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ నిర్వహకుడు తోకల సాగర్.. పేషంట్‌ను తన అంబులెన్స్‌లో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తరలించాలని ఆ ఆస్పత్రి నిర్వహకులు తెలుపడంతో హుటాహుటిన కరీంనగర్‌కు తీసుకెళ్లాడు అంబులెన్స్ నిర్వహకుడు సాగర్. అయితే రోగి బంధువులు కరీంనగర్‌లోని కెల్విన్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని కోరగా, తను మాత్రం తనకు కమిషన్ ఇచ్చే కరీంనగర్‌లోని అకీరా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.
అక్కడ వైద్యులు లేకపోవడంతో అరగంట ఎదురు చూసి రోగి బంధువులు చెప్పిన కెల్విన్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే పేషెంట్ బ్రెయిన్‌డెడ్ అయ్యిందని, అరగంట ముందు తీసుకువస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని డాక్టర్లు చెప్పడంతో చేసేదీలేక.. బ్రెయిన్‌డెడ్ అయిన సింధూజను తిరిగి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు రోగి బందువులు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిందూజ ఏప్రిల్ 1వ తేదీన మృతి చెందింది. ఇందుకు అంబులెన్స్ నిర్వహకుడే కారణమంటూ రోగి బంధువుల ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అంతే పోలీసుల విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి.
అంబులెన్స్ ల దందా ఏ తీరున సాగుతుందో.. కాసుల కక్కుర్తికి రోగుల రక్తాన్ని అంబులెన్స్ నిర్వహకులు ఎలా జలగాల్లో పీలుస్తున్నారో.. అంబులెన్స్ డ్రైవర్లను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆస్పత్రులు ఎలా చలామణి అవుతున్నాయో.. పీఆర్వోలంటే ఆర్ఎంపిలు , పిఎంపిలు ఏ రీతిన రెచ్చిపోతున్నారో తేటతెల్లమైంది. తీగ లాగితే డొంకంత కదిలినట్టు అంబులెన్స్ నిర్వహకుడు సాగర్ వ్యవహారంతో మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ ల కమిషన్ల దందా గుట్టు రట్టైంది.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. అంబులెన్స్‌లకు భారీ తాయిలాలు
మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరైన సౌకర్యాలు, క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండానే సూపర్ స్పెషాలిటీ, మల్టీస్పెషాలిటీ బోర్డులు తగిలించుకుని ప్రజలను మోసం చేస్తున్నాయి. అంబులెన్సుల డ్రైవర్లు, నిర్వాహకులు, వ్యాపారస్తులు, రియల్టర్లు సైతం ధనార్జనే ధ్యేయంగా దవాఖానలు పెడుతున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ల పేరిట పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ, అక్కడ ఉండేది ఎంబీబీఎస్ డాక్టర్లే. మరికొన్ని చోట్ల బీఏఎంఎస్ లు, బీహెచ్ఎంఎస్ లతోనే నడుపుతున్నారు. కరోనాతో మొదలైన ఈ దందా నోట్ల వర్షం కురిపిస్తూ మంచిర్యాల జిల్లా అంబులెన్స్ నిర్వహకులను కోటీశ్వరులను చేసిందని తేలింది. ఎంతలా అంటే కరోనాకు ముందు అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న ఓ వ్యక్తి మంచిర్యాల జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఓనర్ అయ్యే అంత. మంచిర్యాల జిల్లాలో సుమారు 175 ప్రైవేట్ అంబులెన్స్‌లు ఉంటే, రవాణా శాఖ నుంచి ఫిట్‌నెస్ పొందినవి 92 ఉన్నాయి. కొన్ని పనికి రాకుండా పోగా, మరో 20 అంబులెన్స్‌లు ఫిట్‌నెస్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే ఇందులో 50 పైగా అంబులెన్స్ లు ప్రభుత్వ ఆస్పత్రికి రోగి రావడమే ఆలస్యం క్షణాల్లో ప్రైవేట్ ఆస్పత్రికి చేర్చి కమిషన్లతో జల్సాలు చేస్తున్నట్టు తేలింది.
డ్రైవర్ నుండి జిల్లా వైద్యశాఖ వరకు కమిషన్ల దందా
ఈ దందాలో ఇటు వైద్యశాఖ తో పాటు రవాణా శాఖ కూడా మాముల్ల మత్తులో చూసిచూడనట్టు నడుచుకున్నట్టు ఆరోపణలున్నాయి. అంబులెన్స్‌ల వ్యవస్థపై పర్యవేక్షణ చేసే అధికారులు లేకపోవడంతో కోట్లకు పడగలెత్తున్నారు ఈ జిల్లా అంబులెన్స్ నిర్వహకులు. ఆక్సిజన్, వెంటిలెటర్ ఉండే వాహనంలో కనీస పరిజ్ఞానం ఉన్న నిపుణులు ఉన్నారా.. ఆపత్కాలంలో బాధితులను తరలించేప్పుడు ప్రాథమిక చికిత్సపై అవగాహన ఉందా అన్నది పరీక్షించే అధికారే లేకపోవడంతో అంబులెన్స్ నిర్వహకులది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది.
108 వాహనాల్లో అయితే పైలెట్లు శిక్షణ పొంది వాహనం నడుపుతారు. 108 అంబులెన్స్‌లో రోగుల క్షేమం కోసం నిపుణులు ఉంటారు. ఈ సిబ్బందిపై జిల్లా మేనేజర్ పర్యవేక్షణ ఉంటుంది. ప్రైవేటు అంబులెన్సుల్లో మాత్రం అవేమి ఉండవు.. డ్రైవింగ్ వస్తే చాలు అనుకుంటున్నారు యజమానులు. ఇక ఈ దందాలో అంబులెన్స్ యజమానులు, డ్రైవర్లు తెర మీద కనిపిస్తున్నా.. ఈ మాఫియాను నడిపిస్తున్న వ్యక్తులు మాత్రం అంబులెన్స్ లను ఆస్పత్రులకు మద్య కమిషన్ల దందా ఖరారు చేసే పీఆర్వోలదే రాజ్యం. వాళ్లు చెప్పిన ఆస్పత్రికి రోగిని తరలిస్తే మరింత కమిషన్.. నెలనెలా బోనస్.. విందులు వినోదాలు.. గోవా ట్రిపుల్ ఒక్కటేమిటి కోకొల్లలు.
ఈ పీఆర్వో గిరిని చేస్తున్నది ఉన్నత చదువులు చదిని వ్యక్తులనుకుంటే పొరపాటే.. ఆ పీఆర్వోలంతా.. గ్రామాల్లో వచ్చిరాని వైద్యం చేసే ఆర్ఎంపి , పీఎంపిల నుండి మొదలు ప్రమాదాన్ని గుర్తించి సమాచారం ఇచ్చే ఆటో డ్రైవర్ల వరకు పీఆర్వోలుగా చెలామణి అవుతున్నారని సమాచారం. వీరందరిని పెంచి పోషిస్తున్నది జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహకులే అని సమాచారం.
నాణానికి మరో వైపు..
నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే.. ఈ దందాకు దూరంగా ఉంటూ ప్రాణదాతలుగా నిలుస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్న అంబులెన్స్ నిర్వహకులు కూడా లేకపోలేదు. వాళ్లంతా ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల మాఫియా సామ్రాజ్యానికి ఎదురెళ్లి నిలిచి గెలవలేక సాధారణ అంబులెన్స్ డ్రైవర్ కం ఓనర్లుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంబులెన్స్ తీరుపై కఠిన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నారంతా. కానీ అది అయ్యే పనేనా..? చూడాలి మరీ రేవంత్ సర్కార్ మంచిర్యాల అంబులెన్స్ ల రక్తదాహానికి ఎలా చెక్ పెడుతారో.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీరుకు ఎలా అడ్డుకట్ట వేస్తారో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…