
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆ మహనీయునికి సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆలోచనా విధానమే ఈ ప్రజా పాలనకు పునాది అని స్పష్టం చేశారు. గాంధీజీ శాంతితో యుద్ధాన్ని గెలిస్తే, అంబేద్కర్ రాజ్యాంగంతో దేశ గమనాన్ని మార్చారని కొనియాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల పాత్ర మరువలేనిదని, పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన గద్దరన్న, జయ జయహే తెలంగాణ గీతాన్ని అందించిన అందేశ్రీ వంటి మన బిడ్డల కృషిని విస్మరించడం ఎవరి తరమూ కాదని అన్నారు.
గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని సీఎం వివరించారు. ‘‘ఒక దళిత బిడ్డ స్పీకర్ స్థానంలో ఉంటే.. ఆయన్ని గౌరవించకుండా అసెంబ్లీకి రాకుండా కొంతమంది అవమానిస్తున్నారు” అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. దళిత బిడ్డలు ఆర్థిక, ఆరోగ్య శాఖ వంటి కీలక పదవుల్లో ఉండకూడదా? అని ప్రశ్నించిన ఆయన, దళితులను అవమానించిన వారే నేడు మైక్ కోసం దళితులను అడిగేలా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.
విద్య ద్వారానే జీవితాలు మారుతాయన్న అంబేద్కర్ నమ్మకాన్ని నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు. కులాల అంతరం తొలగించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచామని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల్లోనూ తమ ప్రభుత్వం దూసుకుపోతోందని సీఎం గణాంకాలతో వివరించారు. రెండేళ్లలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలకే దక్కాయన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే లభించాయని వెల్లడించారు.
నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని సీఎం ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించి మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసేలా కుట్ర జరుగుతోందని, ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
‘‘మేం పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దుతూ నిరంతరం పనిచేస్తుంటే.. వెనక నుంచి కొందరు కుట్రలు చేస్తూ గోతులు తవ్వుతున్నారు. ఆ గోతులు తవ్వే వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే బాధ్యత ప్రజలదే’’ అని సీఎం ఘాటుగా హెచ్చరించారు. గత పదేళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన వారు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రజలదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం ముగించారు.