Cotton Price Hike: సిరుల వర్షం కురిపిస్తున్న ‘తెల్ల బంగారం’.. ఆ మార్కెట్‌లో పత్తికి ఆల్‌టైమ్ రికార్డ్ ధర..!

|

May 07, 2022 | 6:20 AM

Cotton Price Hike: తెల్ల బంగారం రైతుల ఇంట సిరుల వర్షం కురిపిస్తోంది. తాజాగా జమ్మికుంట మార్కెట్‌లో పత్తికి ఆల్‌టైం రికార్డ్‌ ధర లభించింది.

Cotton Price Hike: సిరుల వర్షం కురిపిస్తున్న ‘తెల్ల బంగారం’.. ఆ మార్కెట్‌లో పత్తికి ఆల్‌టైమ్ రికార్డ్ ధర..!
Cotton Market Price
Follow us on

Cotton Price Hike: తెల్ల బంగారం రైతుల ఇంట సిరుల వర్షం కురిపిస్తోంది. తాజాగా జమ్మికుంట మార్కెట్‌లో పత్తికి ఆల్‌టైం రికార్డ్‌ ధర లభించింది. అవును, మార్కెట్‌లో తెల్లబంగారం ధర పరుగులు పెడుతోంది. పత్తికి కేంద్ర ప్రభుత్వ కనీస మద్ధతు ధర క్వింటాలుకు 6,025 రూపాయల కన్నా రెండు రెట్లు ఎక్కువ పలుకుతుండటం గమనార్హం. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర 13వేల రూపాయలు పలికింది. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత సంవత్సరం ఎకరానికి 8 నుండి పది క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. అప్పుడు క్వింటాల్‌కు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు మాత్రమే ధర వచ్చింది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. కానీ, ఈ ఏడాది ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాల పత్తి దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా 13 వేల రూపాయలు, మాడల్ ధర 10,200, కనిష్ట ధర 8,500 పలికింది. కేవలం జమ్మికుంటలోనే కాదు, ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధర పలికుతోంది. అటు ఏపీలోనూ పత్తికి ఆల్‌ టైం రికార్డ్‌ ధరలు వస్తున్నాయి. ఈ ఏడాది పత్తిసాగు తగ్గడం, దిగుబడి తగ్గడంతో పత్తికి డిమాండ్‌ పేరుగుతోందని అంటున్నారు వ్యాపారులు. అటు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి విపరీతంగా డిమాండ్‌ ఉంది. దీంతో పత్తి పండించే రాష్ట్రాల్లో అధిక ధరలు పెట్టి కొంటున్నారు వ్యాపారులు. అయితే, పెరిగిన ధరలు కొంత ఊరట ఇస్తున్నా, ఈఏడాది వాతావరణ మార్పులతో పత్తి దిగుబడి తగ్గిందని చెబుతున్నారు రైతులు.