Telangana: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు.. 10 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశం

|

Oct 23, 2022 | 3:01 PM

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై కాస్త సీరియస్‌గానే రియాక్టయింది కాంగ్రెస్ హైకమాండ్. షోకాజ్ నోటీజు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Telangana: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు.. 10 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశం
MP Komatireddy Venkat Reddy
Follow us on

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ నోటీసులు ఇచ్చింది. 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలంటూ వెంకట్ రెడ్డి ఇటీవల మాట్లాడిన ఆడియో కాల్ లీకైన సంగతి తెలిసిందే. స్థానిక కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి.. తన తమ్ముడికి అండగా నిలబడాలని ఆయన కోరారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి.. ఈ రకంగా ప్రవర్తించడంపై సీరియస్ అయిన కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ మెంబర్ సెక్రటరీ తారిఖ్ అన్వర్ ఈ షోకాజ్ నోటీసును వెంకటరెడ్డికి పంపారు.

సొంత పార్టీ క్యాండిడేట్‌కు బదులుగా ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీ చేస్తున్న రక్త సంబంధం కలిగిన అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం పార్టీ లైన్ దాటడమేనని ఆ నోటీసులో పేర్కొన్నారు. క్రమశిక్షణ తప్పినట్లు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని.. తదుపరి ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వెంకట్ రెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరారు.

ప్రజంట్ ఫ్యామిలీతో  కలిసి ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఫలితాలు వచ్చాక తిరిగి రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన డెడ్‌లైన్ నవంబర్ 2వ తేదీతో ముగుస్తుంది. మునుగోడు పోలింగ్ వచ్చే నెల 3న జరగనుంది. పోలింగ్‌ జరగడానికి ముందే కోమటిరెడ్డి తన వివరణను పార్టీకి  తెలియజేయాల్సి ఉంటుంది.

మరిన్ని మునుగోడు వార్తల కోసం..