మునుగోడు ఉప ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సభ్యత్వానికి దాసోజు శ్రావణ్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు పంపించారు. సదరు లేఖలో రాజీనామాకు సంబంధించిన కారణాలను వివరించారు. ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రావణ్ గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే ఈ మధ్యే ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లిన విషయం విదితమే.
‘ తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం అనిశ్చితమైన దశదిశాలేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తానన్న మీరు.. మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలే, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగిస్తున్న వైఖరి నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైంది’.
‘అనేక ఆశలతో ఆశయాలతో నేను బీజేపీలో చేరినప్పటికీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మ రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని ఆనతికాలంలో అర్ధమైంది. ప్రజాహితమైన పధకాలతో, నిబద్దత కలిగిన రాజకీయ సిద్దాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఎన్నికల్లో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని దాసోజు శ్రావణ్ లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఏఐసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసిన దాసోజు శ్రావణ్ ఇటీవలే బీజేపీలోకి చేరారు. ఇక ఆ పార్టీ సిద్దాంతాలు నచ్చక రెండు నెలలు గడవకముందే ఆయన టీఆర్ఎస్‌లో చేరనున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ నేతలు అనుసరిస్తున్న తీరు పట్ల అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాసోజు శ్రావణ్ లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఉపఎన్నికల వేళ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలోకి చేరడంతో అలెర్ట్ అయిన సీఎం కేసీఆర్.. స్వయంగా బీజేపీలోకి చేరిన తెలంగాణ ఉద్యమ నేతలకు స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనుండగా.. ఆయన బాటలోనే మరికొందరు ఉద్యమకారులు, బీసీ నేతలు పార్టీలో చేరనున్నారని గూలబీ వర్గాలు చెబుతున్నాయి.