
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విమానాశ్రయ కల నెరవేరబోతోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో త్వరలోనే విమానం ఎగరబోతోంది. ఆదిలాబాద్ పౌరవిమానాశ్రయానికి వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటు ప్రజలు ఇటు పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేయగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓకే చెప్పింది. విమానాశ్రయంతో పాటు వాయుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు లేఖలో తెలిపింది. ఈ శుభవార్తతో ఆదిలాబాద్ ప్రజానీకం మురిసిపోతోంది. పార్టీలకు అతీతంగా ఆదిలాబాద్ విమానశ్రయ ఏర్పాటు అంశంపై హర్షం వ్యక్తమవుతోంది. మామునూరు ఏర్పాటు తరహాలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అనుమతుల ఘనత మాదంటే మాదంటున్నాయి అధికార, ప్రతిపక్షాలు. ఏది ఏమైనా దశాబ్దాల కల నెరవేరబోతుండటంతో ఇన్నాళ్లకైనా అడవుల జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తోంది జిల్లా ప్రజానికం.
ఆదిలాబాద్ విమానశ్రయ కల ఇప్పటి కాదు.. స్వాతంత్ర్యానికి ముందే ఇక్కడ విమానాలు ఎగిరిన ఘన చరిత్ర జిల్లా సొంతం. నిజాం కాలంలో యుద్దవిమానాలకు ఊపిరిపోసిన చరిత్ర ఆదిలాబాద్‌కు ఉంది. 1930లోనే యుద్ధభూమికి వెళ్లే యుద్ధ విమానాలకు ఇంధనం నింపడానికి ఏకంగా 369 ఎకరాల భూమిలో ఏరోడ్రోమ్‌ను స్థాపించారు అప్పటి నిజాం రాజులు. 1947లో స్వాతంత్ర్యానంతరం ఈ ఏరోడ్రమ్ భారత వైమానిక దళం నియంత్రణలోకి వెళ్లాయి. 1970 చివరి వరకు పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే హెలికాప్టర్లకు ఇంధనం నింపే కేంద్రంగా ఉపయోగించారు. 2014లో ఏరోడ్రోమ్‌ను పూర్తి స్థాయి వైమానిక దళ స్టేషన్‌గా మార్చాలని IAF ప్రతిపాదించింది. అదిగో అప్పటినుండి ఇప్పటి దాకా ఆ ఏరోడ్రమ్ లో ఎప్పుడెప్పుడు విమానం ఎగురుతుందా.. మా జిల్లా తలరాత ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూడటం తప్ప, కల సాకారమయ్యే ఆశ కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చింది జిల్లా ప్రజానీకం. ఎట్టకేలకు వాయి సేన గ్రీన్ సిగ్నల్ తో ఆకాశమంతా ఆశలను మోసుకొచ్చినట్టైంది.
2017లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రోమ్‌ను ఆనుకుని ఉన్న కచ్కంటి, ఖానాపూర్, తంతోలి, అనుకుంట గ్రామాల పరిధిలో 1,592 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించడంతో విమానశ్రయ ఆశలకు ఊపిరిపోసినట్టైంది. 2018లో ఇదే హామీని ఎన్నికల్లో తెర మీదకి తెచ్చిన బీజేపీ, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న పరిస్థితులపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) డిప్యూటీ మేనేజర్ అమిత్ కుమార్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నీరజ్ గుప్తాలతో కూడిన బృందం సర్వే చేసి ఓ రిపోర్ట్ ను కేంద్రానికి పంపింది. తాజాగా 2023 లోను బీజేపీ ఎన్నికల హామీలోకి చేరిన విమానశ్రయ ఏర్పాటు తాజాగా ఎయిర్ క్రాప్ట్ కు కేంద్రం, వాయిసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదిలాబాద్ జిల్లా వాసుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది.
విమానాశ్రయం ఏర్పాటుకోసం ఇప్పటికే ఆదిలాబాద్ శివారులో 369 ఎకరాలు విమానాశ్రయ భూములు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్ స్ట్రిప్ నిర్మాణానికి ఆదిలాబాద్ శివారులోని ఖానాపూర్‌లో 481.16 ఎకరాల పట్టా భూములు, 50 ఎకరాల అసైన్డ్ భూములు, అనుకుంటలో 535.38 ఎకరాల పట్టా భూములు, 34.04 ఎకరాల అసైన్డ్ భూములు, తంతోలిలో 261.27 ఎకరాల పట్టా భూములు, 5.02 ఎకరాల అసైన్డ్ భూములు కేటాయించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. మొత్తంగా 1590 ఎకరాల్లో విమానశ్రయాన్ని నిర్మాణం చేయాలని అధికారులు 2019 లోనే కేంద్రానికి రిపోర్ట్ పంపించారు. విద్యుత్, నీరు, రోడ్లు, భవనాల కోసం 40 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. 2019కి ముందు నుండే ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులు నిలిపేశారు. ఎయిర్‌ఫోర్స్ విభాగం అధికారులు కూడా ఇప్పటికే 12 సార్లు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో విమానాశ్రయం నెలకొల్పితే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూడు జిల్లాలకు గుర్తింపు వస్తుందని.. ఉత్తర భారతంతో తెలంగాణకు రాకపోకలు పెరిగి వ్యాపారంతో పాటు ఉన్నతాధికారులు, జాతీయ నాయకుల తాకిడి పెరుగుతుందని అంతా కోరుకుంటున్నారు.
ఇటీవల ఎంపీ నగేశ్ ఇటీవల పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి వినతి పత్రం అందించడం.. అటు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని పలు మార్లు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు అనుమతులు ఇవ్వాలంటూ కోరడం.. శాసన సభలో ఆదిలాబాద్ విమానశ్రయ అంశాన్ని లేవనెత్తడం జరిగాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం ఆదిలాబాద్ అభివృద్దికి, విమానాశ్రయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావాలని కోరడం.. అందరూ ఆశించినట్టుగానే కేంద్రం నుండి ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుపై సానూకూల ప్రకటన రావడంతో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ఆశలు నెరవేరినట్టే.
అటు మామునూర్ ఇటు ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని ఏకకాలంలో తీసుకొచ్చిన ఘనత మాదేనంటూ మంత్రి కోమటరెడ్డి ప్రకటించడం జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఉత్సహాన్ని నింపింది. మరో వైపు బీజేపీ సైతం ఆదిలాబాద్ పౌర విమానయానానికి, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించిదంటూ సంబరాలకు సిద్ధమైంది. ఏదేమైనా అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం చేయడంతో పాటు, పౌర టర్మినల్ ఏర్పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్ వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి పనులు పట్టాలెక్కితే.. ఆకాశంలో విహరించే భాగ్యం అడవుల జిల్లా ప్రజలకు దక్కినట్టు. కేంద్రం అదనపు అనుమతులతో శిక్షణ సంస్థ కూడా ఏర్పాటైతే ఆదిలాబాద్ కు పూర్వ వైభవం రావడం ఖాయం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..