Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడ, మధ్య మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర- దక్షిణ ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
ఇదిలా ఉంటే ఏపీలోనూ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపా ఆవరణంలో దక్షిణ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపిన అధికారులు.. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..