కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. లగ్జరీ ప్రయాణం, తక్కువ సమయంలో గమ్య స్థానాన్ని చేరుకోవడం వంటి ప్రయోజనాలు వందే భారత్‌కు ఆదరణ పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. ఇక తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందే భారత్ రైలు సికింద్రాబాద్ టు విశాఖపట్నం రూపంలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో వందే భారత్ రైలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ టు తిరుపతికి వందే భారత్ రైలు సేవలను ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
మరికొన్ని రోజుల్లోనే పట్టాలెక్కనున్న ఈ రైలు రూట్ మ్యాప్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. గంటకు 150 కి.మీల వేగంతో దూసుకెళ్లేలా ట్రాక్ నిర్మాణం, బ్రిడ్జిల పటిష్టత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వందే భారత్ రూట్‌ను ఖరారు చేస్తుంటారు. ఇందులో భాగంగానే రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి పలు మార్గాలను సర్వే చేసింది. మొత్తం నాలుగు మార్గాలు ఉండగా ఇందులో బీబీనగర్- నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారులు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఈ రూట్ వందేభారత్ రైలు వేగానికి అనుకూలంగా ఉండడం.. దూరం కూడా తక్కువగా ఉండడంతో.. దీన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పిడుగురాళ్ల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూపిడుగురాళ్ల జంక్షన్ నుంచి డైవర్ట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. పిడుగురాళ్ల నుంచి శావల్యపురం మీదుగా నేరుగా ఒంగోలు వరకు నడుపుతారు. అక్కడి నుంచి సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి వెళ్తుంది.ఇదిలా ఉంటే ఈ రూట్‌లో తిరుపతి చేరుకోవడానికి సాధారణంగా 12 గంటల సమయం పడుతుంది. కానీ వందే భారత్ ద్వారా 6 నుంచి 8 గంటల్లో చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో తిరుపతికి వెళ్లే పర్యాటకులు పెద్ద ఎత్తున వందే భారత్‌ను ఆశ్రయించే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక టికెట్ ధరలు ఎలా ఉంటాయన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..