
నేటి సమాజంలో మానవ సంబంధాలు నానాటికి దిగజారి పోతున్నాయి. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అని అంటారు. తండ్రి లేకపోయినా మేనమామ ఉండాలని అంటారు. తోడబుట్టిన సోదరి పిల్లలను మేనమామ ఎంతో గారాబంగా చూసుకుంటూ ఉంటారు. మేనమామపై కూడా సోదరి పిల్లలకు అంతే అభిమానం ఉంటుంది. కానీ ఓ మేనల్లుడు మాత్రం తన మేనమామను ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యాతండాకు రమావత్ రవి (34)కి మిర్యాలగూడ మండలం ఏడుకోట్లతండాకు చెందిన లక్ష్మితో 11ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వేములపల్లి మండలం సల్కునూరు పిఎసిఎస్ లో అటెండర్‌గా రవి పని చేస్తున్నాడు. మిర్యాలగూడ మండలం దొండవారి గూడెంకు చెందిన సోదరి కొడుకు గణేష్.. హైదరాబాద్ మహానగరంలోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు అవసరాల కోసం మేనమామ రవి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో గణేష్.. తండ్రిలాంటి మేనమామ భార్యపైనే కన్నేశాడు. మందలించాల్సిన అత్త కూడా మేనల్లుడితో వివాహేతర సంబంధానికి అంగీకరించింది.
దీంతో కొంతకాలంగా గణేష్ – లక్ష్మీల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం రవి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. అయినా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో ఏడాది క్రితం భర్త రవితో గొడవపడిన లక్ష్మి మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాలోనీ పుట్టింటికి వెళ్లిపోయింది. రవి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద మనుషులతో మాట్లాడించి లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయినా లక్ష్మీ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లక్ష్మీ పథకం వేసింది.
రవి ఇంటి ముందు ఉన్న గుడిసెలో రవి తల్లిదండ్రులు ఉంటున్నారు. రవి పెద్ద కుమారుడిని హాస్టల్లో విడిచిపెట్టేందుకు అతడి తండ్రి సూర్యాపేటకు వెళ్లగా, తల్లి వ్యవసాయ పనులకు వెళ్ళింది. మధ్యాహ్నం రవి మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తుండగా.. లక్ష్మీ తన ప్రియుడు గణేశ్‌ను ఇంటికి పిలిచింది. రవి నోట్లో టవల్ పెట్టి కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం గణేశ్, లక్ష్మీ, లక్ష్మీ చిన్న కొడుకును తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. తెల్లారినా.. కొడుకు, కోడలు గది నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వచ్చి చూడగా రవి విగత జీవిగా పడి ఉన్నాడు.
మనవడు, కోడలు కలిసి తన కొడుకుని హత్య చేశారని రవి తండ్రి లక్ష్మానాయక్ ఆరోపించాడు. తండ్రి లక్ష్మానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గణేశ్ తోపాటు లక్ష్మీ, మానసిక దివ్యాంగుడైన ఆమె చిన్న కుమారుడు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..