
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం (ఏప్రిల్ 25) సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ ఆవిర్భావ సభలో తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా ఆమె నామకరణం చేశారు. గతంలో తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ పేరునే (టీఆర్‌ఎస్) స్వల్ప మార్పుతో మళ్ళీ తెరపైకి తీసుకురావడం విశేషం.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ ద్వారా తాను పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. “వచ్చిన తెలంగాణ దారి తప్పింది. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగిపోయింది. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కుటుంబంలో నేను భాగమైనందుకు కొన్ని విషయాల్లో, ముఖ్యంగా ఇసుక మాఫియా వంటి అంశాల్లో సిగ్గుపడుతున్నాను. కానీ, తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నాను” అని ఆమె వ్యాఖ్యానించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే ఐదు ప్రధాన అంశాలను ‘పాంచజన్యం’ పేరుతో ఐదు హామీలను కవిత ప్రకటించారు.
1. విద్య: ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉచిత విద్య.
2. వైద్యం: ఏ ఆస్పత్రిలోనైనా ఉచిత వైద్య సేవలు.
3. వ్యవసాయం: రైతే రాజు నినాదాన్ని నిజం చేయడం.
4. ఉపాధి: యువతకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు. మొదటి ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు, ఉద్యమకారుల కోసం లక్ష సూపర్‌న్యూమరీ పోస్టుల కేటాయింపు.
5. సామాజిక న్యాయం: అన్ని వర్గాల వారి సంక్షేమానికి ప్రాధాన్యత
కవిత ప్రకటనపై బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ ఫార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం.. పాత పార్టీల పేర్లను పోలిన పేర్లతో కొత్త పార్టీలను అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రజలను గందరగోళానికి గురిచేసే ఎత్తుగడ మాత్రమేనని కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక X ద్వారా పేర్కొన్నారు.
Relax guys
Election Commission of India won't permit it
ECI rules prevent reuse of similar namesThe ECI does not allow registration of a new party if:
* The name is identical or very similar to an existing/previous party
* It may confuse voters
* Cap of ten years is in place…— Karthik Indra Reddy Patlolla (@KarthikIndrAnna) April 25, 2026
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందిస్తూ.. తెలంగాణలో ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి వచ్చే నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. గతంలో టీఆర్‌ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మళ్లీ ఇప్పుడు పుట్టబోయే టీఆర్‌ఎస్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు అవినీతి రహిత మోదీ పాలన వైపే ఉన్నారని, తెలంగాణలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి కవిత కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…