
మందు ప్రియలారా.. ఇది మీ కోసమే..! ఈ మధ్య కిక్కులో తేడా కనిపిస్తోందా? ఖరీదైనా బ్రాండ్ కొన్నా.. అదే చీప్ లిక్కర్ కంపుకొడుతుందా? వేసిన సీల్ వేసినట్లే ఉన్నా అసలు సరుకు మాయమైనట్లు అనిపిస్తుందా? అయితే, మీ అనుమానం నిజమే. మీ కిక్కుకు చెక్ పెట్టారు కేటుగాళ్లు. కిక్కు తగ్గడమే కాదు.. మీ ప్రాణాలను కబళిస్తున్న దందా ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఏంటో ఈ మధ్య ఎంత తాగినా కిక్ ఎక్కడం లేదు. మొదట బాగానే ఉండేది. కాస్త పడగానే కిక్ ఇచ్చేది. రాను రాను సరుకు నీళ్లలా ఉంటుంది. అసలు నీళ్లు కలపకుండా ‘రా’ తాగకూడదు. కానీ.. రా తాగినా కిక్ ఎక్కడం లేదు. నకిలీ మద్యమా అని అనుకుందామంటే.. సీసా ఒరిజినల్‌ది. పైగా సీలు కూడా ఉంది. మరి ఏమై ఉంటుందా? అని ఇటీవల మందుబాబుల మధ్య పెద్ద చర్చే నడిచింది. నిన్నటి వరకు సమాధానం దొరకలేదు. కానీ ఇప్పుడు బండారమంతా బయటపడింది. సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారీ గోదాంపై తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సూపరిండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయడంతో మందుబాబులకు విషయం అర్థమైంది. ఒరిజినల్ ఖాళీ బాటిల్స్‌ను సేకరించి, అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్, కొంత మద్యం కలిపి.. సీల్ వేసి కిక్‌కు చెక్ పెట్టిన మద్యం మాఫియా అరాచకం తెలిసింది. ఈ కల్తీ ఒకటి రెండు బ్రాండ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఏకంగా 178 బ్రాండ్లనే కల్తీ చేశారు.
పోలీసులు దాడులు చేసి సుమారు 15 లక్షల రూపాయల విలువైన కల్తీ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం ప్యాక్ చేసి సిద్ధంగా ఉన్న కల్తీ మద్యం మాత్రమే. షాకింగ్ విషయం ఏంటంటే.. నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకు, అంటే సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన స్పిరిట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు నకిలీ మద్యం నింపి మార్కెట్‌లోకి పంపడానికి సిద్ధంగా ఉన్న 11 వేల ఖాళీ బాటిళ్లు, వాటికి అతికించాల్సిన 20 లేబుల్ బండిల్స్ కూడా పట్టుబడ్డాయి. ఖరీదైన బ్రాండ్ల సీసాలను సేకరించి వాటికి సరిపడా మూతలు, లేబుళ్లను అక్రమార్కులు తయారు చేసుకుంటున్నారు. ఆ సీసాలో స్పిరిట్‌తో తయారుచేసిన కల్తీ మద్యం పోసి ఒరిజినల్ తరహా మూతలు బిగిస్తున్నారు. ఇలా బాటిల్ క్యాప్‌ల నుంచి హాలోగ్రామ్ సీల్స్ వరకు అన్నీ ఒరిజినల్‌ను పోలి ఉండేలా కాపీ చేశారు. ఇది మార్కెట్‌లోకి వచ్చాక ఇది నకిలీ బాటిల్ అని గుర్తించడం చాలా కష్టం.
ఈ ముఠా హైదరాబాద్‌లోని కృష్ణపద్మ అనే స్పిరిట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ స్పిరిట్ కొనుగోలు చేసి, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని ఒక రైస్‌మిల్లులో రహస్యంగా కల్తీ సరుకు తయారు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఈ కల్తీ మద్యాన్ని మార్కెట్‌లోకి పంపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం, రేపల్లె, అమలాపురం వంటి పలు కీలక ప్రాంతాల్లోనూ ఈ ముఠా నకిలీ మద్యాన్ని విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో కౌంటర్ విధులు నిర్వహిస్తున్న శంకర్‌తో పాటు మరికొందరు ఈ ముఠాలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ భారీ దందా గుట్టు రట్టైంది.
ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యాన్ని నింపి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న ముఠా కుట్ర ఎట్టకేలకు బయటపడింది. ఖరీదైన బ్రాండ్లలో కల్తీ మద్యాన్ని కలపడం ద్వారా ఎవరికీ అనుమానం రాదనుకున్నారేమోగాని వారి పాపం పండి చివరకు అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరిని అరెస్ట్ చేసి పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి