
మొబైల్‌లో ఉండే కెమెరా చిన్నదే అయినా అందులో ఉండే ఫీచర్లు డీయస్‌ఎల్‌ఆర్ కెమెరా రేంజ్‌లో ఉంటున్నాయి. మొబైల్స్‌లో ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న మల్టిపుల్ కెమెరా సెటప్‌తో.. మొబైల్ ఫొటోగ్రఫీ ఇంకో మెట్టు పైకెక్కింది. కొన్ని చిన్న టెక్నిక్స్, ఫీచర్స్‌ను ఉపయోగించి, ప్రొఫెషనల్ లుక్ ఉండే ఫొటోలు ఎలా తీయాలో చూద్దాం.
ఇప్పుడొస్తున్న ప్రతీ మొబైల్ కెమెరాలో ‘హెచ్‌డీఆర్’ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌తో ప్రొఫెషనల్ లుక్ ఉండేలా ఫొటోలు తీయొచ్చు. హెచ్‌డీఆర్ అంటే ‘హై డైనమిక్ రేంజ్’. ఈ మోడ్‌లో ఫొటోలు తీస్తే.. దూరంగా ఉన్న కొండలు లేదా ఆబ్జెక్ట్స్ లాంటివి కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. లైటింగ్‌లో హెచ్చుతగ్గులుంటే, ఈ మోడ్ వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక్కో ఫొటోను మూడు ఎక్స్‌పోజర్ సెట్టింగ్స్‌తో తీసి, మూడింటిని బ్యాలెన్స్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. ల్యాండ్ స్కేప్స్ ఫొటోగ్రఫీలో ఈ మోడ్ బాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు అన్ని మొబైల్స్‌లో మల్టిపుల్ కెమెరాలుంటున్నాయి. అలాంటి మొబైల్స్ అన్నింటిలో పొట్రెయిట్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఫ్రేమ్‌లో ఉన్న మనిషిని ఫోకస్‌లో ఉంచి మిగతా బ్యాక్ గ్రౌండ్‌ని బ్లర్ చేయడం ఈ మోడ్ స్పెషాలిటీ. పోట్రెయిట్ మోడ్‌లో తీసే ఫొటోలు డీయస్‌ఎల్‌ఆర్ లుక్‌కు దగ్గరగా ఉంటాయి. అందుకే ఈ మోడ్ చాలామందికి ఫేవరెట్.
బస్ట్ మోడ్ చాలా మొబైల్ కెమెరాల్లో ఉంటుంది. కానీ ఎవరూ దీన్ని అంతగా వాడరు. బస్ట్ మోడ్‌లో కెమెరా కంటిన్యూస్‌గా ఫొటోలు తీస్తుంది. స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ, యాక్షన్ ఫొటోగ్రఫీలో ఈ ఫీచర్ ఎక్కువగా వాడుతుంటారు. చాలామంది గాల్లోకి ఎగిరిన ఫొటో స్టి్ల్స్ పెడుతుంటారు. అలాంటి ఫొటోలు మామూలుగా తీయడం కష్టం. సరిగ్గా గాల్లో ఉన్నప్పుడు కరెక్ట్‌గా క్లిక్ మనిపించడం మొబైల్‌తో కుదరని పని. అలాంటప్పుడు బస్ట్ మోడ్‌ని ఉపయోగించి ఈజీగా తీసేయొచ్చు. బస్ట్ మోడ్ ఆన్ చేసి క్లిక్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే.. కెమెరా వరుస పెట్టి ఫొటోలు తీస్తూనే ఉంటుంది. తర్వాత మనకు నచ్చిన పర్‌ఫెక్ట్ షాట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ప్రొఫెషనల్ కెమెరా అయినా, మొబైల్ కెమెరా అయినా గ్రిడ్ లైన్స్‌ను ఉపయోగించడం తెలిస్తే అందమైన ఫొటోలు తీయొచ్చు. ఇప్పుడొస్తున్న అన్ని మొబైల్ కెమెరా అప్లికేషన్స్‌లో గ్రిడ్ మోడ్ లేదా షో గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఆన్ చేయగానే స్క్రీన్ పై గ్రిడ్ లైన్స్ కనిపిస్తాయి. ఫొటో తీసేటప్పుడు ఆబ్జెక్ట్‌ను ఆ లైన్స్ కలుసుకునే చోట ప్లేస్ చేయాలి. ఈ టెక్నిక్‌ను ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ అంటారు. ప్రతీ ఫొటోకు ఈ టెక్నిక్ అప్లై చేస్తే.. ఫొటోలు చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తాయి.
సన్ గ్లాసెస్‌ను ఉపయోగించి సరదాగా కొన్ని డిఫరెంట్ ఫొటోలు తీయొచ్చు. కెమెరా లెన్స్ ముందు సన్ గ్లాసెస్ ఉంచి ఫొటోలు తీస్తే.. ఫొటో లుక్ పూర్తిగా మారిపోతుంది. సన్ గ్లాస్ కలర్‌ను బట్టి ఫొటోకు ఫిల్టర్ అప్లై అవుతుంది. సన్ సెట్, సన్ రైజ్ లాంటి ఫొటోస్‌కు ఈ టెక్నిక్ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే సన్ గ్లాస్‌పై కొన్ని వాటర్ డ్రాప్స్ చల్లి ఫొటో తీస్తే ఇంకా క్రియేటివ్‌గా ఉంటుంది.
మొబైల్‌ను ఉపయోగించి మరింత ప్రొఫెషనల్‌గా ఫొటోలు తీయాలంటే యాడ్‌ఆన్‌గా మొబైల్ లెన్స్ కూడా కొనుక్కోవచ్చు. చాలా మొబైల్స్‌కు యాడ్‌ఆన్ లెన్స్ దొరుకుతాయి. వీటిలో వైడ్ యాంగిల్ లెన్స్, టెలీఫొటో లెన్స్ కూడా ఉంటాయి. ఆ లెన్స్‌ను మొబైల్ కెమెరాకు ముందు ఫిక్స్ చేసి, ఫొటోలు తీయాలి. ఐఫోన్, వన్‌ప్లస్ లాంటి మొబైల్ కెమెరాలకు ఈ లెన్స్ బాగా పనికొస్తాయి.
దూరంగా ఉన్న వాటిని ఫొటో తీసేందుకు చాలామంది జూమ్ చేస్తుంటారు. నిజానికి మొబైల్ ఫోన్లలో ఉండేది ‘డిజిటల్ జూమ్’ మాత్రమే. అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న దాన్నే జూమ్ చేసి చూపిస్తుంది. అంతేకానీ కెమెరా లెన్స్ జూమ్ అవ్వవు. జూమ్ చేయడం వల్ల ఫొటో రెజల్యూషన్ తగ్గి ఫొటో మసకగా కనిపిస్తుంది. దీనికంటే మంచి రెజల్యూషన్‌తో ఫొటో తీసి కావల్సినంత క్రాప్ చేసుకోవడం బెటర్.
ప్రతీ మొబైల్‌కు హయ్యెస్ట్ రెజల్యూషన్ ఒకటుంటుంది. 50 ఎంపీ, 16 ఎంపీ.. ఇలా మల్టిపుల్ రెజల్యూషన్స్ ఉన్నప్పుడు .. ఫొటోలు వీడియోలు తీసే ముందు హయ్యెస్ట్ రెజల్యూషన్ లో తీస్తున్నామో, లేదో చెక్ చేసుకోవాలి. కెమెరా సెట్టింగ్స్‌కి వెళ్లి వీడియో సైజ్, ఇమేజ్ క్వాలిటీ ఆప్షన్స్‌లో హయ్యెస్ట్ సైజ్, హయ్యెస్ట్ క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి.
వీటితో పాటు మొబైల్ కెమెరా నీట్‌గా ఉండడానికి లెన్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, మొబైల్ కింద పెట్టినప్పుడు కెమెరా లెన్స్‌పై గీతలు పడకుండా పౌచ్ వాడడం లాంటి కేర్ కూడా తీసుకోవాలి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.