Chandrayaan-3: భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు చందమామ వైపుగా నింగిలోకి దూసుకెళ్లబోతుంది. ఇస్రో చేపట్టిన ఈ జాబిల్లి ప్రయాణం వైపు 140 కోట్ల భారతీయులే కాక యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ఇక ఈ చంద్రయాన్-3 మిషన్‌ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఈ మిషన్‌తో హైదరాబాద్‌కి కూడా సంబంధం ఉంది. ఎలా అంటే ఈ చంద్రయాన్ 3 కోసం ఉయోగిస్తున్న రాకెట్‌కి కావాల్సిన కొన్ని పరికరాలు మన హైదరాబాద్‌లోనే తయారయ్యాయి.
అవును, కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లోని నాగసాయి ప్రెసెసియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చంద్రయాన్-3 కోసం వినియోగించిన కొన్ని విడి పరికరాలను తయారుచేసింది. రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను కూకట్‌పల్లిలోనే తయారు చేశారు. ప్రశాంత్ నగర్‌లోని ఈ కంపెనీ యజమాని డీఎన్ రెడ్డి 1998 నుంచి ఇస్రో ప్రయోగించిన 50 శాటిలైట్లలో పలు విడి భాగాలు అందిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా చంద్రయాన్ 3 కోసం పలు స్పేర్ పార్ట్స్‌ని తయారు చేసి అందించారు.
కాగా, ఇప్పటివరకు చందమామపైకి వెళ్లిన ఎక్కువ శాతం వ్యోమ నౌకలు జాబిల్లిపై మధ్య రేఖ ప్రాంతంలోనే దిగాయి. కానీ భారత్ ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగంలోనే మరో ప్రయోగం చేస్తూ.. ఇప్పటివరకు ఎవరూ వెళ్లని దక్షిణ ధృవం వైపుకి వెళ్లనుంది. ఆ ప్రాంతంలోని భౌతిక పరిస్థితులు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుండడంతో అక్కడే పరిశోధన చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఎన్నో కోట్ల ఏళ్లుగా అక్కడి ప్రాంతంలోని కొన్ని భాగాలు చీకట్లోనే ఉన్నాయిన, సూర్యకాంతి చేరని కారణంగా ఆక్కడి మూలకాలు సౌర రేడియో ధార్మికత కారణంగా తలెత్తే మార్పులకు లోనుకాకుండా ఉంటాయని, వాటిపై పరిశోధిస్తే పలు రహస్యాలు తెలిసే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం