నెట్టింట మహా విప్లవం 10G.. కనురెప్ప పాటులో ఇంటర్నెట్.. ఇక బఫరింగ్ అనే మాటే ఉండదు!
దూసుకురానున్న డిజిటల్ సేవలు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వేగం మరో మైలురాయిని చేరుకోబోతోంది. ఇన్నాళ్లూ మనం చూసిన ఇంటర్నెట్ స్పీడ్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోతున్న నెట్ స్పీడ్ మరో ఎత్తు. నెట్టింట మహా విప్లవం మొదలు కానుంది. ఇకపై బఫరింగ్, వెయిటింగ్ లాంటి సమస్యలు పూర్తిగా గతం కానున్నాయి. కనురెప్ప పాటులో ఇంటర్నెట్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

కేవలం 3 మిల్లీసెకన్ల అతి తక్కువ లేటెన్సీతో అద్భుతమైన ఫిక్స్‌డ్-లైన్ ఇంటర్నెట్ కనెక్షన్ రాబోతోంది. ఇంటర్నెట్ వేగంలో వస్తున్న ఈ భారీ మార్పు.. కేవలం పాత మొబైల్ 5G సాంకేతికతకు కొత్త పేరు ఏమాత్రం కాదు. ఇది 10G, ఇప్పుడున్న ఇంటర్నెట్ కంటే అత్యాధునిక, అత్యంత మెరుగైన ఇంటర్నెట్ ఇది. ప్రస్తుతం చైనాలో 10G టెస్ట్ జరితుంది. ఈ టెస్ట్‌లో సెకన్‌కు 9.8GB వరకు స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తోంది. ఇది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్. దీన్ని ఏకంగా హోమ్ ఇంటర్నెట్ రూపురేఖలను సమూలంగా మార్చేసే ఒక సరికొత్త ఫిక్స్‌డ్-లైన్ సంచలనం అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తు డిజిటల్ అవసరాలను తీర్చే బ్రహ్మాస్త్రంగా నిలవనుందంటున్నారు.
ఈ సరికొత్త టెక్నాలజీతో డేటా రాకెట్ వేగంతో దూసుకురానుంది. ఈ అద్భుతమైన వేగంతో హోమ్ ఇంటర్నెట్ దాదాపు కనురెప్ప పాటులో పనిచేస్తున్న అనుభూతిని యూజర్లకు ఇస్తుంది. ఒక హై-డెఫినిషన్ (HD) సినిమా డౌన్‌లోడ్ చేయాలన్నా, వర్చువల్ రియాలిటీ (VR) వీడియోలు చూడాలన్నా, భారీ ఫైల్స్ అప్‌లోడ్ చేయాలన్నా కేవలం సెకన్ల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఇకపై ఆన్‌లైన్ సేవల్లో నిరీక్షణ, ఎదురుచూపులు ఉండవు. స్క్రీన్ ముందు కూర్చుని లోడింగ్ ఐకాన్ వైపు చూస్తూ విసుక్కోవాల్సిన అవసరం అస్సలు రాదు. బఫరింగ్, క్లౌడ్ జాప్యం లాంటి పదాలకు భవిష్యత్తులో చోటే లేదు. ఆన్‌లైన్ గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్, హై-క్వాలిటీ వీడియో కాన్ఫరెన్స్ వంటి సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగిపోయేలా ఈ కొత్త ఇంటర్నెట్ టెక్నాలజీ పని చేయనుంది.
భారీ బ్యాండ్‌విడ్త్ సేవలు సైతం ఎక్కడో మారుమూల ఉన్న క్లౌడ్ సర్వర్లలో కాకుండా.. మీ సొంత సిస్టమ్‌లో, మీ హార్డ్ డిస్క్‌లో ఉన్నంత వేగంగా పనిచేస్తాయి. అత్యంత స్థానికంగా (local) పనిచేస్తున్న అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా అందించే దిశగా టెలికాం సంస్థలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పు కేవలం డౌన్‌లోడ్‌లు వేగవంతం అవ్వడమే కాదు, అంతకుమించిన అత్యుత్తమ డిజిటల్ అనుభవాన్ని యూజర్లకు అందించనుంది.
ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఐటీ ఉద్యోగులకు, రిమోట్ వర్క్ చేసే నిపుణులకు, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు ఈ తరహా హైస్పీడ్ ఇంటర్నెట్ ఒక వరంలా మారనుంది. ఆన్‌లైన్ కార్యకలాపాల్లో విపరీతమైన వేగం పెరగనుంది.రాబోయే రోజుల్లో స్మార్ట్ హోమ్స్, డ్రైవర్‌లెస్ కార్లు, ఐఓటీ (IoT) పరికరాల వాడకం మరింతగా పెరగనుంది. ఇలాంటి విప్లవాత్మక మార్పులకు, అత్యాధునిక టెక్నాలజీలకు ఈ 3 మిల్లీసెకన్ల లేటెన్సీ ఇంటర్నెట్ వెన్నెముకగా నిలవనుంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
