ఎండలు మండిపోయినా పర్లేదు.. సూపర్‌ టెక్నాలజీ వచ్చేసింది! ఏసీ లేకుండానే ఇల్లంతా కూల్‌..కూల్‌..

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త స్మార్ట్ పెయింట్ 97 శాతం వరకు సూర్యరశ్మిని ప్రతిబింబించి భవనాలను చల్లగా ఉంచుతుంది. దీంతో ఏసీ వినియోగం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా గాలిలోని తేమను నీటిగా మార్చే సామర్థ్యం కూడా దీనికి ఉంది. భవిష్యత్తులో వేడి, నీటి కొరత సమస్యలకు ఇది వినూత్న పరిష్కారంగా మారవచ్చు.

ఎండలు మండిపోయినా పర్లేదు.. సూపర్‌ టెక్నాలజీ వచ్చేసింది! ఏసీ లేకుండానే ఇల్లంతా కూల్‌..కూల్‌..
Smart Paint

Updated on: May 30, 2026 | 10:22 PM

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వడగాలుల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త స్మార్ట్ పెయింట్ సాంకేతికత విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రత్యేక నానో-ఇంజనీరింగ్ పూత భవనాలను చల్లగా ఉంచడమే కాకుండా, గాలిలోని తేమను నీటిగా మార్చే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండటం దీని ప్రత్యేకత. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పెయింట్‌లో పాలీవినైలిడీన్ ఫ్లోరైడ్-కో-హెక్సాఫ్లోరోప్రొపీన్ (PVDF-HFP) అనే ప్రత్యేక పాలిమర్‌ను ఉపయోగించారు. ఇందులోని సూక్ష్మ రంధ్రాల నిర్మాణం సూర్యరశ్మిని సమర్థవంతంగా ప్రతిబింబించి, వేడి శోషణను గణనీయంగా తగ్గిస్తుంది. ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో ఈ పూత 97 శాతం వరకు సూర్యకాంతిని పరావర్తనం చేసినట్లు తేలింది.

సాంప్రదాయ పైకప్పులు లేదా గోడలు సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కుతుంటే, ఈ స్మార్ట్ పెయింట్ పూసిన ఉపరితలాలు చుట్టుపక్కల గాలి ఉష్ణోగ్రత కంటే 6 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉండగలవని పరిశోధకులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ముదురు రంగు పైకప్పులతో పోలిస్తే 25 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత తేడా నమోదైంది. దీంతో భవనాల లోపలి భాగాల్లో వేడి తగ్గి, ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్ల వినియోగం తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ పెయింట్‌లో మరో ప్రత్యేకత గాలిలోని తేమను నీటి బిందువులుగా మార్చే సామర్థ్యం. ఉపరితలం చల్లగా ఉండటం వల్ల నీటి ఆవిరి ఘనీభవించి నీటి రూపంలో సేకరించబడుతుంది.

దీనికి ఎలాంటి విద్యుత్ అవసరం ఉండదు. ఆరు నెలల పాటు నిర్వహించిన పరీక్షల్లో అనుకూల పరిస్థితుల్లో రోజుకు ప్రతి చదరపు మీటరుకు సుమారు 390 మిల్లీలీటర్ల వరకు నీటిని సేకరించగలిగినట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఈ సాంకేతికతను గృహాలు, వాణిజ్య భవనాలు, గిడ్డంగులు, వ్యవసాయ కేంద్రాలు, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పెయింట్ ఇంకా పరీక్షల దశలోనే ఉన్నప్పటికీ, పెరుగుతున్న వేడి, నీటి సమస్యలను ఎదుర్కోవడంలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం వంటి వేడి వాతావరణం కలిగిన దేశాలకు ఈ సాంకేతికత ఉపయోగకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us