భారతదేశ స్మార్ట్ ఫోన్ లో మిడ్ రేంజ్ ఫోన్లకు ఉండే క్రేజ్ వేరు. మన దేశంలో సాధారణ మధ్యతరగతి వారిని ఆకట్టుకునేలా మంచి ఫీచర్లలో మిడ్ రేంజ్ ఫోన్లు విడుదల చేస్తే ఆ సంస్థే దేశంలోనే నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ కంపెనీగా అవతరించగలదు. ఈ పల్స్ పట్టుకుంది కాబట్టే షావోమి ఈ రంగంలో ఎప్పట్నుంచో నంబర్ వన్ గా నిలబడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.
షావోమి మార్కెట్ కు ఒప్పో, వివోల నుంచి ఎటువంటి ముప్పూ లేకపోయినా.. ఒప్పో సబ్ బ్రాండ్ అయిన రియల్ మీ షావోమి మార్కెట్ కు గండి కొట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. రియల్ 3, 3 ప్రో.. వాటి తర్వాతి వెర్షన్లు రియల్ మీ 5, 5 ప్రోలతో ఇప్పటికే రెడ్ మీ మార్కెట్ కు కొంతమేర గండి కొట్టిన రియల్ మీ తాజాగా రియల్ మీ ఎక్స్ టీ అంటూ మరో ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా ఉందంటూ చేసిన ప్రచారం ఈ ఫోన్ కు చాలా మేరకు కలిసివచ్చింది. ఇంతకీ ఆ ఫోన్ ఎలా ఉందంటే.. రియల్ మీ ఎక్స్ టీ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించారు.
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ కింద ఆరు నెలల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ లభించనుంది. ఈ ఫోన్ నీలం(బ్లూ), తెలుపు(వైట్) రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉన్న నాలుగు కెమెరాల సెటప్ ను వెనకాల అందించడంతో కెమెరాల విషయంలో రియల్ మీ మిగతా ఫోన్ల కంటే చాలా ముందుంది. 64 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉన్న కెమెరా, వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండటం మంచిదే అయినా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాలుగు లెన్స్ లనూ ఉపయోగించి మీరు ఒకే ఫొటో తీయలేరు. మీరు ఎంచుకునే కెమెరా మోడ్ ని బట్టి.. లెన్స్ ల ఉపయోగం మారుతుంది.
మీరు రూ.15,000 నుంచి రూ.20,000 మధ్యలో మంచి ఫోన్ కోసం వెతుకుతున్నారంటే.. రియల్ మీ ఎక్స్ టీని కచ్చితంగా తీసుకోవచ్చు. మీరు రియల్ మీ ఎక్స్ తో దీన్ని పోలిస్తే పెద్దగా సంతృప్తి చెందలేకపోవచ్చు. కొత్త ప్రాసెసర్, 64 మెగా పిక్సెల్ కెమెరా, వెనకవైపు నాలుగు కెమెరాలు.. ఇవన్నీ పేపర్ మీద రాసుకుని చూస్తే ఉన్నంత గొప్పగా ఫోన్ వాడుతుంటే అనిపించలేదు. కానీ ఈ ధరల శ్రేణిలో ఉన్న షావోమి, శాంసంగ్, ఇతర ఫోన్లతో పోలిస్తే మాత్రం కచ్చితంగా ఒక అడుగు ముందే ఉంటుంది.