AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charging Tips: పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా..? ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ..

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా.. అయితే యూఎస్‌బీ పోర్టు ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే జ్యూస్ జాకింగ్ విధానంలో మీ ఖాతాలోని డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేయవచ్చు.

Charging Tips: పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా..? ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ..
Charging Usb
Venkatrao Lella
|

Updated on: Aug 08, 2026 | 6:47 PM

Share

రిమోట్, వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌లు ఇటీవల బాగా పెరిగిపోయాయి. దీంతో చేతిలో ఫోన్, ల్యాప్ టాప్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఇక ఎక్కడికైనా ప్రయాణాలంటే చేసేటప్పుడు కూడా ల్యాప్ టాప్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రయాణాల సమయంలో పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే ఛార్జింగ్ పోర్ట్‌ల నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, మెట్రో రైళ్లు, ఎయిర్ పోర్ట్.. ఇలా ప్రతీచోట పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పోర్ట్‌లు అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పెద్ద ప్రమాదంలో పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జ్యూస్ జాకింగ్ అంటే ఏంటి..?

పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లను సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. వివిధ పద్దతుల ద్వారా వినియోగదారుల సమాచారాన్ని తెలుసుకుని బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మను కాజేస్తున్నారు. అందులో ఒకటి జ్యూస్ జాకింగ్ విధానం. సైబర్ నేరగాళ్లు పబ్లిక్ ప్రదేశాల్లోని యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లను తారుమారు చేస్తున్నారు. అలాగే నకిలీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. యూఎస్‌బీ పోర్టుల ద్వారా మొబైల్‌లోకి మాల్వేర్లు పంపిస్తున్నారు. దీని ద్వారా ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం తెలుసుకుని బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు దొంగలిస్తున్నారు. యూఎస్‌బీ డివైస్‌లు కేవలం ఛార్జింగ్ కోసమే కాకుండా డేటా షేరింగ్ కోసం ఉపయోగపడతాయి. మీ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌లోని డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగించుకుంటున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సైబర్ నేరాలకు పాల్పడేవారు ఛార్జింగ్ పోర్ట్‌లలో ఒక చిన్న హార్డ్ వేర్ పరికరాన్ని లేదా రహస్య కంప్యూటర్ పరికరాన్ని అమర్చుతారు. దీని ద్వారా మీ ఫోన్, ల్యాప్‌టాప్‌లోకి చొరబడతారు. ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యక్ చేసి మీ బ్యాంక్ వివరాలను తెలుసుకుంటారు. దీంతో మీరు పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో డేటా బదిలీ, ఈ పరికరాన్ని విశ్వసించండి అని వచ్చే ఆప్షన్లను క్లిక్ చేయకండి. పబ్లిక్ యూఎస్‌బీ పోర్టుల్లో పెట్టుకునే బదులు మీ సొంత ఛార్జింగ్ అడాప్టర్‌ను తీసుకెళ్లండి. ఛార్జింగ్ అడాప్టర్‌ను నేరుగా ఎలక్ట్రికల్ సాకెట్‌లో పెట్టండి. ఇక మార్కెట్లో అనేక యూఎస్‌బీ డేటా బ్లాకర్లు ఉన్నాయి. వీటిని పబ్లిక్ ప్రదేశాల్లో ఉపయోగించండి. ఈ పరికరాలు యూఎస్‌బీ డేటా పిన్‌ను నిరోధించి కేవలం మీ ఫోన్‌కు పవర్‌ను మాత్రమే చేరుస్తుంది. ఇక ప్రయాణాల సమయంలో సొంత పవర్ బ్యాంక్ ఉపయోగించండి.

Follow Us