అద్భుతమైన ఫీచర్లతో నోకియా 6.2 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లలో శుక్రవారం విడుదలైంది. నిజానికి ఈ ఫోన్ ను గత నెలలో బెర్లిన్ లో జరిగిన ఐఎఫ్ఏ 2019లోనే లాంచ్ చేసినా, మన దేశానికి మాత్రం శుక్రవారమే వచ్చింది. నోకియా 6.2 ధరను భారతదేశంలో రూ.15,999గా నిర్ణయించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, నోకియా అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆఫ్ లైన్ మొబైల్ స్టోర్లలో కూడా నేటి నుంచే విక్రయం ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి సెరామిక్ బ్లాక్ కలర్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, ఐస్ కలర్ వేరియంట్ కూడా విడుదల కానుంది.
అమెజాన్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డుతో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే.. రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పాత స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ చేంజ్ ద్వారా మరో రూ.10,100 వరకు తగ్గింపు పొందవచ్చు. నోకియా వెబ్ సైట్ లో నవంబర్ 30 లోపు ఈ ఫోన్ ను కొనుగోలు చేసేవారికి రూ.1,500 విలువ చేసే వోచర్ లభించనుంది. ఆఫ్ లైన్ కస్టమర్లకు కూడా పలు అదనపు లాభాలు లభించనున్నాయి. ఇందులో రూ.7,200 వరకు జియో నుంచి లభించే లాభాలు కూడా ఉన్నాయి.
ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఈ డిస్ ప్లే హెచ్డీఆర్ 10ను సపోర్ట్ చేస్తుంది. దీనికి రక్షణగా గొరిల్లా గ్లాస్ 3ని అందించారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే… ఇందులో ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ ను ఉపయోగించారు. బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్ గా ఉంది. దీనికి వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ కాగా, దీని అపెర్చర్ f/1.8గా ఉంది. 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న వైడ్ యాంగిల్ కెమెరాను, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. వీటి అపెర్చర్ f/2.2గా ఉంది. అపెర్చర్ f/2.0గా ఉన్న 8 మెగా పిక్సెల్ కెమెరాను సెల్ఫీ కెమెరాగా ఉపయోగించారు.