సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో వాట్సాప్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా సమాచార మార్పిడికి దీనిని మించిన సాధనం లేదంటే అతిశయోక్తి కాదేమో! అందుకే బిజినెస్ మెన్, ఉద్యోగస్తులు, స్టూడెంట్స్, టీచర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఒకరేమిటి అందరూ వాట్సాప్ ను విరివిగా వినియోగిస్తున్నారు. అన్ని సెక్షన్ల వినియోగదారుల అవసరాలను గుర్తించి, అందుకనుగుణంగా మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు తీసుకొస్తోంది. అయితే ఎన్న అప్ డేట్ తెచ్చినా ప్రైవసీ విషయంలో వాట్సాప్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. పొరపాటున మన ఫోన్ ఎవరిచేతులోనైనా పడితే.. వాట్సాప్ ఓపెన్ చేస్తే మన వ్యక్తిగత విషయాలు, చాట్ హిస్టరీ అంతా బహిర్గతం అయిపోతుంది. ఇప్పుడు దీనిని పరిహరించేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది. వినియోగదారులకు మరింత భద్రత, ప్రైవసీని కల్పించడమే లక్ష్యంగ కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. వాబీటా ఇన్ ఫోలో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం లాక్ చాట్ (Lock Chat) అనే మరో కొత్త ఫీచర్ ని వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది దీనితో యూజర్లు తమ ప్రైవేటు చాట్లను లాక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అంటే తమ వ్యక్తిగత చాట్ హిస్టరీని ఎవరూ చూడకుండా చేసుకోవచ్చు. దీని ద్వారా వ్యక్తిగత ప్రైవసీ, భద్రత మరింత పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ లాక్ చాట్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే మీ చాట్ లిస్ట్ లో నుంచి ఏదో ఒక చాట్ ను లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వాట్సాప్ ని ఎవరైనా ఓపెన్ చేసినా చాట్ హిస్టరీ ఏమి కనపడదన్నమాట. కేవలం యూజర్ మాత్రమే చూడగలగుతారు. అది చాట్ లాక్ ఓపెన్ కావాలంటే వినియోగదారుని ఫింగర్ ప్రింట్ లేదా పాస్ వర్డ్ అవసరం అవుతుంది.
లాక్ చాట్ ఫీచర్ ద్వారా ఇతరులెవరూ లాక్ చేసిన చాట్లను తెరవడం, చదవడం వంటివి చేయడం కుదరదు. ఒక వేళ ఎవరైనా ఫోన్ తీసుకును లాక్ చేసిన చాట్లను పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్ లేకుండానే చదవాలని ప్రయత్నిస్తే హెచ్చరిస్తుంది. ఆ చాట్ మొత్తాన్ని చెరిపేయాలని కోరుతుంది. అంతే కాదు లాక్ చేసిన చాట్‌లో వచ్చిన ఫోటోలు, వీడియోలు ఫోన్ గ్యాలరీలో నేరుగా సేవ్ కావని వాబీటాఇన్ ఫోలో పేర్కొన్నారు.
ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటాలో పరీక్షిస్తున్నారు. ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలీదు. దీనిని అధికారికంగా ప్రారంభించిన తర్వాత, ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ఫీచర్ లో మరో ప్రత్యేకత ఎంటంటే లాక్ చేసిన చాట్ లన్నీ ఓ ప్రత్యేకమైన ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. ఎప్పుడు కావాలంటే అప్పడు వాటిని ఆర్కైవ్స్ లోకి వెళ్లి చూడొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి