NASA Study: వాతావరణంలో మార్పులు భూమిపై ఆకస్మికంగా అనేక ఉపద్రవాలకు కారణంగా మారుతూ వస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ఫలితంగా అనేక దేశాలలో, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లో వరదలు సంభవించాయి. కానీ ఇప్పుడు, ఒక కొత్త అధ్యయనం విపరీత వాతావరణ సంఘటనలకు కారణంగా భూమికి దగ్గరలో ఉన్న చంద్రుడిలో వచ్చే మార్పులుగా భావిస్తోంది. యుఎస్ స్పేస్ ఏజెన్సీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇది వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరగడంతో పాటు, చంద్రుని కక్ష్య “డోలనం” భూమిపై వినాశకరమైన వరదలకు కారణమవుతుందని పేర్కొంది. నేచర్ క్లైమేట్ చేంజ్ పత్రికలో ఈ అధ్యయనం జూన్ 21 న ప్రచురించారు.
“హానికరమైన వరదలు” అని ప్రస్తుతం వీటిని పిలుస్తున్నారు. ఇవి సముద్ర తీరప్రాంతాల్లో అలలు రోజువారీ సగటు కన్నా రెండు అడుగుల ఎత్తు ఎగసిపడినప్పుడు సంభవిస్తాయి. వీటి వలన తీరప్రాంతాలలో ఉండే జనజీవనం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఎగసిపడే సముద్రం నీరు స్థానికంగా వీధుల్లోనూ, ఇళ్ళల్లోనూ చేరిపోవడంతో రోజువారీ పనులు స్తంభించిపోతాయి. ఈ హానికరమైన వరదలు 2030 ల మధ్య నాటికి మరింత తరచుగా.. సక్రమంగా మారుతాయని నాసా అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం, యు.ఎస్. తీరప్రాంతంలో కనీసం ఒక దశాబ్దం పాటు మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువ ఆటుపోట్లు కనిపిస్తాయి. ఈ వరదలు సంవత్సరం అంతా సమానంగా రావు. ఇవి కొన్ని నెలల్లోనే వరుసగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది.
“సముద్ర మట్టానికి సమీపంలో ఉన్న తక్కువ ప్రాంతాలు వరదలు పెరగడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నాయి. అదేవిధంగా ఈ పరిస్థితి మరింత దిగజారిపోతుంది” అని నాసా నిర్వాహకుడు బిల్ నెల్సన్ అన్నారు. “చంద్రుడి గురుత్వాకర్షణ పుల్, పెరుగుతున్న సముద్ర మట్టా, వాతావరణ మార్పుల కలయిక మన తీరప్రాంతాల్లో అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంత వరదలను పెంచుతుంది.“ అని అయన చెప్పారు. భూమి మీద వచ్చే వరదలపై చంద్రుడి ప్రభావాన్ని వివరిస్తూ, అధ్యయనం ప్రధాన రచయిత హవాయి విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిల్ థాంప్సన్, చంద్రుని కక్ష్య డోలనం 18.6 సంవత్సరాలు పడుతుంది అన్నారు. డోలనం ఎల్లప్పుడూ ఉంటుంది. దీనిలో ప్రమాదం ఏమిటంటే, ఇది గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్ట పెరుగుదలతో కలిసిపోతుంది అంటూ థాంప్సన్ చెప్పారు.
ఆ 18.6 సంవత్సరాల సగాభాగంలో భూమి సాధారణ ఆటుపోట్లు తగ్గిపోతాయి. అధిక ఆటుపోట్లు సాధారణం కంటే తక్కువగా ఉంటాయి. తక్కువ ఆటుపోట్లు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. మిగిలిన భాగంలో, ప్రభావం తారుమారు అవుతుంది. దీనిని చంద్రుని ‘టైడల్ యాంప్లిఫికేషన్’ దశ అంటారు. తదుపరి ఈ చక్రం 2030 లలో ఉంటుందని ఊహిస్తున్నారు. ఇది సాధారణ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా తీరప్రాంతాలలో అని ఫిల్ థాంప్సన్ చెబుతున్నారు.
Also Read: Wonder In Planet: ఆకాశంలో అద్భుతం..!! జులై 13న నేరుగా చూడొచ్చు..!! ( వీడియో )