
కొత్త మొబైల్ ఫోన్ కొనాలనుకునేవారు ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిది. ఎందుకంటే. కొత్త సంవత్సరంలో సెల్‌ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. 2026లో ద్రవ్యోల్బణం కారణంగా ఫోన్ల ధరలు పెరగనున్నాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. మొబైల్ ఫోన్లలో వాడే మెమరీ, టెక్నాలజీ సంబంధిత భాగాల ధరలు పెరగడం, అమెరికా డాలర్-భారత రూపాయి మారకంలో హెచ్చుతగ్గుల కారణంగా ధరలలో 10 శాతం పెరుగుదల అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
వచ్చే ఏడాది దేశంలో స్మార్ట్ ఫోన్ల ధరలు మరో 10 నుంచి 15 శాతం పెరగవచ్చని వెల్లడించింది. అంతర్జాతీయ పరిణామాలు కూడా ఫోన్ల ధరల పెరుగుదలకు కారణమవుతుందని తెలిపింది. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కైలాష్ లఖానీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ల ధరలు ఇకపై స్థిరంగా ఉండకపోవచ్చన్నారు.
రియల్‌మీ, షియోమి, ఒప్పో, వివో వంటి ప్రధాన బ్రాండ్లు.. ఎక్కువగా అమ్ముడవుతున్న తమ మోడళ్ల ధరలను పెంచాయని తెలిపారు. కొన్ని బ్రాండ్స్ నేరుగా MRPని పెంచుతుండగా.. మరికొన్ని బ్యాంక్ క్యాష్ బ్యాక్‌లను నిలిపివేయడం, సున్నీ వడ్డీ EMI పథకాలను ముగించడం చేస్తున్నాయని వెల్లడించారు. మరికొన్ని బ్రాండ్లు రిటైల్ మద్దతును తగ్గించడం ద్వారా మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెప్పారు. హాంకాంగ్‌లో టెక్ లీడర్ల సమావేశంలో షియోమీ వైస్ ప్రెసిడెంట్, రియల్‌మీ సీఈవో తోపాటు తాను పాల్గొన్నట్లు లఖానీ తెలిపారు. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ భవిష్యత్తును గురించిన ఆందోళనలు వ్యక్తమయ్యాయని వెల్లడించారు.
దీపావళి తర్వాత కస్టమర్ల రద్దీ తగ్గడంతో రిటైల్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతిందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) తెలిపింది. AIMRA, ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ORA) ప్రకారం.. డిసెంబర్ నెలలో జరిగిన అమ్మకాలు.. నవంబర్, సెప్టెంబర్ నెలల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో పెద్ద, చిన్న రిటైలర్లు సిబ్బంది జీతాలు, దుకాణాల అద్దె చెల్లించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. 2026లో మొబైల్ ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఎంత వీలైతే అంత త్వరగా కొత్త ఫోన్లను కొనుగోలు చేసి.. పెరగనున్న ధరల నుంచి బయటపడవచ్చు.