Tesla Plant: టెస్లాకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బీజేపీ పాలిత రాష్ట్రం.. పూర్తి వివరాలు

|

Jan 18, 2022 | 6:33 PM

టెస్లా ప్లాంట్‌ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలికాయి. భారత్‌లో టెస్లా ప్రవేశించేందుకు ప్రభుత్వం నుంచి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గత వారం ట్వీట్ చేశారు.

Tesla Plant: టెస్లాకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బీజేపీ పాలిత రాష్ట్రం.. పూర్తి వివరాలు
Elon Musk's Tesla Motors
Follow us on

Automobile News: టెస్లా(Tesla) ప్లాంట్‌ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలికాయి. భారత్‌లో టెస్లా ప్రవేశించేందుకు ప్రభుత్వం నుంచి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు  ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్(Elon Musk) గత వారం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR).. తమ రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రావాలని ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టంచేశారు. ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూచించారు. తెలంగాణ బాటలోనే పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు కూడా టెస్లాను ఆహ్వానించాయి. పెట్టుబడులకు తమ రాష్ట్రాలు అనువైన ప్రాంతాలుగా స్పష్టంచేశాయి.

తాజాగా బీజేపీ పాలిత కర్ణాటక కూడా ఎలాన్ మస్క్ తమ రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించింది. ఇప్పటికే తమ రాష్ట్రం భారత దేశపు ఎలక్ట్రిక్ వాహనాల(EV) హబ్‌గా గుర్తింపు సాధించిందని గుర్తుచేసింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇది ఎంతో అనువైన ప్రాంతంగా కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశ్ ఆర్ నిరాని ట్వీట్ చేశారు. తమ రాష్ట్రంలో 400 ఆర్‌ అండ్ డీ సెంటర్లు, 45కు పైగా ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌లు, బెంగళూరుకు సమీపంలో ఓ ఈవీ క్లస్టర్ ఏర్పాటైననట్లు గుర్తుచేశారు. అలాగే టెస్లా కంపెనీ దేశంలో తొలిసారిగా బెంగుళూరు అడ్రస్‌తో రిజిస్టర్ అయ్యిందని గుర్తు చేశారు. పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఏ రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గుచూపుతారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని గత ఏడాది టెస్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ముందుగా దేశీయంగా ప్రారంభించాలని టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించింది. ఎక్కడో ఉత్పత్తి చేసిన టెస్లా ఈవీ వాహనాలను విక్రయించేందుకు భారత్‌ను మార్కెట్‌గా వాడుకోవాలంటే అనుమతించేది లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తే తగినన్ని రాయితీలు కల్పిస్తామని తెలిపింది. అయితే ప్రస్తుతం టెస్లా కోరుతున్నన్ని రాయితీలు దేశంలోని ఏ ఇతర కంపెనీకి కల్పించడం ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. టెస్లాకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తే.. ఇతర పరిశ్రమలకు సరైన సంకేతాలు వెళ్లదని పేర్కొంది.

అదే సమయంలో రాయితీల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే గత వారం మస్క్ ట్వీట్ చేశారని చెబుతున్నారు.

Also Read..

TSRTC Income: ఈ సంక్రాంతి టీఎస్ ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది.. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా!

IRCTC Tirupati: విమానంలో తిరుప‌తి వెళ్లాల‌నుకుంటున్నారా.? ఐఆర్‌సీటీసీ ఈ కొత్త ప్యాకేజ్ మీ కోస‌మే..