
భారతదేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నౌక దళం తన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరబోతోంది. స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా తన సేవలు ప్రారంభించారు. జూలై 11వ తేదీ శనివారం రోజున విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో కమిషనింగ్ వేడుక జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోతూ సింహంలా విరుచుకుపడే ప్రత్యేకత ఐఎన్ఎస్ మహేంద్రగిరి సొంతం.
భారతదేశ రక్షణ రంగం మరింత బలోపేతం చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. మూడు వైపులా సముద్రం ఉన్న భారతదేశానికి నౌకాదళం అత్యంత కీలకం. అందుకే అత్యాధునిక యుద్ధనౌకలను నావికాదళం సమకూర్చుకుంటుంది. సముద్ర జలాల్లో శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సరికొత్త యుద్ధనౌకలను రంగంలోకి దింపుతోంది. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతికత, స్వదేశీ నైపుణ్యంతో రూపుదిద్దుకున్న సస్టెల్త్ ఫి గ్రేట్ మహేంద్రగిరి ఇప్పుడు సేవలందించేందుకు సిద్ధమైంది.
శివాలిక్ క్లాస్ ఫ్రిగ్రేట్లకు కొనసాగింపుగా ప్రాజెక్టు 17 ఏ ని రక్షణ శాఖ చేపట్టింది. ఈ సిరీస్లో ఏడు అత్యాధునిక స్టెల్త్ ఫి గ్రేట్ లను సిద్ధం చేయాలనేది లక్ష్యం. ఈ ప్రత్యేక శ్రేణిలో ఆరవ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వత క్రీడలను పేరును సార్ధకం చేస్తూ ఈ యుద్ధనౌకకు మహేంద్రగిరిగా నామకరణం చేశారు. ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. మేరీ వర్షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకకు రూపకల్పన చేసింది.
బ్రహ్మోస్, క్రూజ్ క్షిపణులు, 76 ఎంఎం నేవల్ గన్, ట్రిపుల్ టోర్పిడో వరుణాస్త్ర లు, రాకెట్ లాంఛర్లు, రెండు ధ్రువ్, సీకింగ్ హెలికాప్టర్లు వంటి ఆయుధ సంపత్తి కలిగి ఉంటుంది ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి. వేగం గంటకు 28 నాట్స్.. శత్రువుల నౌకలు, జలాంతర్గాముల కదలికలను పసిగట్టడానికి అనువుగా ఉంటుంది. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నౌక శత్రువు రాడారులకు చిక్కకుండా తన పని పూర్తి చేస్తుంది. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రాడార్, సోనార్ వ్యవస్థలు అదనపు బలం. నౌక పొడవు 149 మీటర్లు, వెడల్పు 17.8 మీటర్లు, బరువు 6,670 టన్నులు.
అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత, తక్కువ రాడార్ గుర్తింపు, అధిక స్థాయి ఆటోమేషన్, మెరుగైన రక్షణ వ్యవస్థలతో ఈ నౌకను నిర్మించారు. ఈ యుద్ధ నౌక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ వ్యవస్థతో పనిచేస్తుంది. దీని ద్వారా అధిక వేగంతో పాటు దీర్ఘకాల సముద్ర కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం లభిస్తుంది.
75 శాతానికిపైగా స్వదేశీ పరికరాలతో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ప్రతీకగా నిలుస్తోంది ఐఎన్ఎస్ మహేంద్రగిరి. దీని నిర్మాణంలో పలు భారతీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు భాగస్వామ్యం కావడంతో దేశీయ రక్షణ తయారీ రంగానికి మరింత బలం చేకూరిందని అంటున్నారు నిపుణులు. శక్తివంతమైన గంభీరమైన సాటిలేని అనే నినాదంతో ఈ నౌక భారత నావికాదళంలో కీర్తి పతాకను ఎగురవేనుంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిధిలో నిఘా రక్షణ విధులు నిర్వహించనుంది ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో వ్యూహాత్మక హిందూ పసిఫిక్ ప్రాంతంలో భారత సముద్ర ప్రయోజనాల రక్షణలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..