ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ విడుదలయ్యిందంటే చాలు షాపుల ముందు వినియోగదారులు బారులు తీరుతారు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16 మార్కెట్ లోకి వచ్చేసింది. కానీ ఈ సారి షాపుల ముందు పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే మీ ఇంటికి ఐఫోన్ 16 వచ్చేస్తుంది. టాటా కంపెనీ ఈ సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. తన నిత్యావసరాలను సరఫరా యాప్ అయిన బిగ్ బాస్కెట్ ద్వారా ఈ సేవలు అందిస్తోంది. అలాగే బ్లింకిట్, జెప్టో కూడా ఐఫోన్ 16 డెలివరీ సేవలు ప్రారంభించాయి.
బిగ్ బాస్కెట్ అందించే కిరాణా సేవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఐఫోన్ 16 డెలివరీని కూడా ప్రారంభించింది. ఈసేవను అధికారికంగా ప్రారంభించిన కొద్ది నిమిషాలకే ఐఫోన్ 16ను కస్టమర్ కు డెలివరీ చేసింది. బెంగళూరు కోరమంగళలోని ఒక కస్టమర్ ఉదయం 8:00 గంటలకు ఆర్డర్ చేశాడు. అతడికి ఉదయం 8:07 గంటలకే ఫోన్ ను బిగ్ బాస్కెట్ అందించింది. సర్వీసును ప్రారంభించిన మొదటి రోజే అందరికీ ఆశ్యర్యపరిచింది. దీనిపై ఆ కస్టమర్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. తాను ఎప్పుడు కిరాణా సామగ్రిని బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేస్తానని తెలిపాడు, ఇప్పుడు ఐఫోన్ 16ను అత్యంత వేగంగా డెలివరీ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపాడు. బిగ్‌బాస్కెట్ సాధించిన విజయం మిగిలిన సంస్థకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. డెలివరీల ప్రపంచంలో మారుతున్న కొత్త విధానాలకు నిదర్శనంగా నిలిచింది. అలాగే బ్లింకిట్, జెప్టో వంటి కంపెనీలు కూడా ఈ విషయంలో పోటీ పడుతున్నాయి.
బ్లింకిట్ లో ప్రస్తుతం ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 128 జీబీ వేరియంట్ మాత్రమే కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎస్ బీఐ క్రెడిట్ కార్డులతో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడళ్లను కొనుగోలు చేస్తే రూ. 5 వేలు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అయితే ప్రో మోడళ్లు కావాలంటే స్టోర్లకు వెళ్లాలి. ప్రస్తుతానికి బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్ లలో అధిక స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో లేవు. రాబోయే వారంలో ప్రో మోడళ్లు తీసుకువస్తారేమో వేచి చూడాల్సిందే. బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా తెలిపిన వివరాల ప్రకారం.. బ్లింకిట్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే సరికొత్త ఐఫోన్ 16ను డెలివరీ చేయనున్నారు. ఢిల్లీ ఎన్ సీఆర్, ముంబై, పూణే, బెంగళూరు నగరాలలో ఐఫోన్ విడుదల రోజునే కస్టమర్లకు అందించడానికిచర్యలు తీసుకున్నారు. దీని కోసం యునికార్న్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. అలాగే యునికార్న్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లతో డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఖాతాదారుల కోసం ఈఎంఐ ఎంపికలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి షాపులు ముందు వేచి ఉండాల్సిన బాధ తప్పింది. కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిలో కూర్చుని ఒక్క బటన్ నొక్కితే చాలు 20 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఐఫోన్ 16 మీ ఇంటికి వచ్చేస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి