WhatsApp new feature: వాట్సాప్‌లో అదిరే ఫీచర్.. ఇక తప్పు మెసేజ్ పంపినా ఫర్వాలేదు.. పూర్తి వివరాలు ఇవి..
వాట్సాప్ లో ఏదైనా తప్పు మెసేజ్ పంపితే దానిని డిలీట్ చేయడమో లేక తిరిగి మరో మెసేజ్ పంపడమో చేస్తుంటాం. అయితే ఇకపై ఆ కష్టం ఉండదు. త్వరలో అందుబాటులో రానున్న ఈ ఫీచర్ తో మీరు ఇతరులకు పంపిన మెసేజ్ కూడా ఎడిట్ అవుతుంది.

వాట్సాప్.. సమాచార మార్పిడికి అందరూ వినియోగించే బెస్ట్ యాప్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు దీనిని వినియోగిస్తున్నారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన వినియోగదారుల అవసరాలను ఇప్పటికప్పుడు గుర్తిస్తూ కొత్త అప్ డేట్లను అందిస్తూ ఉంటుంది. ఈ విషయంలో వాట్సాప్ కు వంక పెట్టడానికి లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఇప్పటి వరకూ వెనకబడే ఉంది. అదేంటంటే వాట్సాప్ నుంచి ఇతరులకు పంపించిన మెసేజ్ ను తిరిగి ఎడిట్ చేసుకోనే ఆప్షన్ దీనిలో లేదు. దీంతో ఏదైనా తప్పు మెసేజ్ పంపితే దానిని డిలీట్ చేయడమో లేక తిరిగి మరో మెసేజ్ పంపడమో చేస్తుంటాం. అయితే ఇప్పుడు సరిగ్గా వాట్సాప్ ఇదే విషయంలో కొత్త అప్ డేట్ ను తీసుకొస్తోంది. త్వరలో అందుబాటులో రానున్న ఈ ఫీచర్ తో మీరు ఇతరులకు పంపిన మెసేజ్ కూడా ఎడిట్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆ యాప్స్ లో ఇప్పటికే ఉంది..
టెలిగ్రామ్, స్లాక్, ఐమెసేజ్ వంటి ప్రముఖ యాప్స్‌లో.. ఈ ఎడిట్ మెసేజ్ అనే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ కోట్లాది మంది వాడే వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వాస్తవానికి 2022 నుంచే ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తూ వస్తోంది వాట్సాప్. రానున్న కొన్ని వారాలు, నెలల్లో ఇది యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి వాట్సాప్ లో ‘డిలీట్ మెసేజ్ ఫర్ ఎవరీవన్’ ఫీచర్ మాత్రమే అందుబాటులో ఉంది. తప్పు మెసేజ్ పంపిస్తే దీనిని ఉపయోగించి.. ఆ మెసేజ్ ను డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు మెసేజ్‌లను ఎడిట్ చేసుకునే ఫీచర్ కూడా వస్తే.. వినియోగదారులకు పని మరింత సులభతరం అయ్యే అవకాశం ఉంది.
కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..
వాట్సాప్ ద్వారా మీరు ఏదైనా తప్పు మెసేజ్ పంపితే అది పంపిన 15 నిమిషాల లోపు దానిని ఎడిట్ చేసుకొనే విధంగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైనా మెసేజ్‌ను ఎడిట్ చేయాలని అనుకుంటే.. ముందుగా దానిని లాంగ్ ప్రెస్ చేయాలి. స్క్రీన్ మీద పెన్సిల్ ఐకాన్‌తో ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా.. మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. చివరికి ఆ మెసేజ్ మీద ‘ఎడిటెడ్’ అని లేబుల్ పడుతుంది. ఒక్కసారి మెసేజ్‌ను ఎడిట్ చేసిన తర్వాత.. ‘వాట్సాప్ లేటెస్ట్ వర్షెన్‌ని ఉపయోగిస్తూ ఈ చాట్‌లో ఉన్నవారందరికీ ఈ మెసేజ్ ఎడిటెడ్ చేయడం జరిగింది,’ అని ఇంగ్లీష్‌లో ఓ టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. వాబీటాఇన్ఫో ప్రకారం.. ఈ ఎడిట్ ఫీచర్ ప్రస్తుతానికి మెసేజ్‌లకే పరిమితం. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత.. ఫొటోస్, స్టేటస్, డాక్యుమెంట్, వీడియోలకు కూడా ఎడిట్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది.



మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..