వారెవ్వా.. సైంటిస్టులు పదేళ్లుగా కష్టపడుతుంటే.. AI కేవలం 48 గంటల్లో సాల్వ్‌ చేసింది!

గూగుల్ అభివృద్ధి చేసిన జెమిని 2.0 కో-సైంటిస్ట్ అనే AI టూల్, యాంటీబయాటిక్స్‌కు నిరోధకత కలిగిన బ్యాక్టీరియా గురించి దశాబ్దాల నాటి రహస్యాన్ని కేవలం 48 గంటల్లో ఛేదించింది. శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన పరిశోధనకు ఏళ్ళు పట్టినప్పటికీ, AI సరైన సమాధానంతో పాటు అదనపు పరిష్కారాలను కూడా అందించింది. ఈ ఘటన AI సామర్థ్యాలను ప్రదర్శించింది, అయితే గోప్యతా అంశాలను కూడా లేవనెత్తింది.

వారెవ్వా.. సైంటిస్టులు పదేళ్లుగా కష్టపడుతుంటే.. AI కేవలం 48 గంటల్లో సాల్వ్‌ చేసింది!
Ai

Updated on: Feb 26, 2025 | 1:15 PM

శాస్త్ర సాంకేతిక రంగంలో కలలో కూడా ఊహించని పెను మార్పులు సంభవిస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏఐ(ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌) గురించి. ఈ ఏఐ భవిష్యత్తులో మనిషి అవసరం లేకుండా అన్ని పనులు చక్కబెట్టేస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఉద్యోగాలు పోతాయని, భవిష్యత్తు మొత్తం ఏఐదే అంటూ చాలా వార్తాకథనాలు కూడా వచ్చాయి. లేదు లేదు ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయని కూడా మరికొంతమంది అంటున్నారు. సో.. ఈ ఏఐని చూసి ఎంత మంది ఆశ్చర్యపోతున్నారు. అంత కంటే ఎక్కువ మంది భయపడుతున్నారు కూడా. తాజాగా ఈ ఏఐ ఓ అద్భుతాన్ని చేసి చూపించింది.

గూగుల్ అభివృద్ధి చేసిన ఐసీ జెమినీ 2.0 కో-సైంటిస్ట్‌ అనే ఏఐ సాధనం, సూపర్‌బగ్‌ల గురించి దశాబ్దం నాటి రహస్యాన్ని కేవలం 48 గంటల్లోనే ఛేదించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు కొన్ని బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్‌లను తట్టుకోగలుగుతున్నాయి అని పరిశీలిస్తున్నారు, ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి, నిరూపించడానికి వారికి ఏళ్లకు ఏళ్లు పట్టింది. ఈ పరిశోధనకు వారు గూగుల్ ఏఐ ‘కో-సైంటిస్ట్’ని పరీక్షించినప్పుడు, అది కేవలం రెండు రోజుల్లోనే ఫలితాన్ని ఇచ్చింది. అది కూడా సరైన సమాధానం ఇచ్చేసింది. ఈ పరిశోధనకు సంబంధిచి ప్రొఫెసర్ జోస్ ఆర్. పెనాడెస్, అతని బృందం ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. అందుకోసం వారికి పదేళ్లకు పైగా సమయం పట్టింది.

కానీ, ఏఐ మాత్రం కేవలం 48 గంటల్లో సైంటిస్టు ఏం కనిపెట్టారో అదే ఆన్సర్‌ ఇవ్వడంతో పాటు అది సరైందే అని నిర్ధారించింది. అంతే కాకుండా మరో నాలుగు ఫార్ములాలు ఇచ్చి.. ఇలా కూడా సమస్యను పరిష్కరించవచ్చు అంటూ వెల్లడించింది. ఇది చూసిన ప్రొఫెసర్‌ పెనాడెస్‌ ఆశ్చర్యపోయారు. ఇంకా తాము కనిపెట్టిన సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా ప్రచురించలేదని, ఏ సంస్థతోనూ పంచుకోలేదని ఆయన వెల్లడించారు. అయినా కూడా ఈ ఏఐ అంత కచ్చితంగా తమ పదేళ్ల శ్రమను కేవలం రెండు రోజుల్లో చేసేసిందని ఆయన అన్నారు. దీనిపై ఆయన కాస్త అనుమానం కూడా వ్యక్తం చేశారు. తన కంప్యూటర్‌ను గూగుల్‌ తన అనుమతి లేకుండా యాక్సెస్‌ చేసి ఉండొచ్చని భావించి, గూగుల్‌ సంస్థను కూడా సంప్రదించారు.

మీరు నా కంప్యూటర్‌ యాక్సెస్‌ కలిగి ఉన్నారా? అంటే ఇందులో డేటా మీరు చూడగలరా? యాక్సెస్‌ చేయగలరా అని ప్రశ్నించారు. దానికి గూగుల్‌ సంస్థ మీ కంప్యూటర్‌ యాక్సెస్‌ తమకు లేదని బదులిచ్చింది. దీంతో ఈ ఏఐ చేసిన అద్భుతానికి ఆయన ఫిదా అయిపోయారు. గూగుల్ జెమిని 2.0 AI వ్యవస్థపై నిర్మించబడిన కో-సైంటిస్ట్ ఏఐ టూల్‌.. కొత్త పరికల్పనలు, పరిశోధన ప్రతిపాదనలను రూపొందించగల “వర్చువల్ సైంటిఫిక్ సహకారి”గా రూపొందించబడింది. గూగుల్ ప్రకారం, ఈ సాధనం కొత్త ఆలోచనలను రూపొందించడంలో పరిశోధకులకు సహాయం చేయడం ద్వారా బయోమెడికల్, శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సాధనాన్ని ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న సంస్థలు విశ్వసనీయ టెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా సూచించింది.