బ్యాంకింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ బాటలో దూసుకెళ్తోంది. ముఖ్యంగా యూపీఐ వినియోగం సమాజంలో బాగా పెరిగింది. వీధి చివరి అరటి బండి వ్యాపారి నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అందరూ క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఫోన్ నంబర్ ద్వారా సులభంగా లావాదేవిలు జరిపే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ)ని వాడుతున్నారు. ఇదే సమయంలో ఆన్ లైన్ మోసాలు కూడా అధికమవుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఎంత ధృఢంగా ఉంటున్నా.. వినియోగదారులు చేసే చిన్న చిన్న తప్పులే నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే మేటి యూపీఐ యాప్ లలో ఒకటైన గూగుల్ పే తన వినియోగదారులకు ఓ హెచ్చరికను జారీ చేసింది. యూపీఐ పేమెంట్ చేసే సమయంలో కొన్ని యాప్స్ ను అసలు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఆ యాప్స్ మీ ఫోన్లో ఉంటే అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
యూపీఐ లావాదేవీలు చేసే వారికి గూగుల్ పే అత్యంత విశ్వసనీయమైన, సురక్షితమైన యాప్ లలో ఒకటి. అందుకే ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. వినియోగదారులకు అధిక భద్రతను అందించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి మోసాల నివారణకు కృషి చేస్తోంది. రియల్ టైంలో మోసపూరిత లావాదేవీలను గుర్తించడానికి ఇది దోహదపడుతోంది. అయితే తరచూ తమ వినియోగదారులు స్క్రీన్ షేరింగ్ యాప్ తమ ఫోన్లో ఎనేబుల్ అయ్యి ఉండగా.. లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన గూగుల్ పే వారికి ఓ వార్నింగ్ మెసేజ్ పంపింది. దీనివల్ల మీరు స్కామర్లకు టార్గెట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గూగుల్ పే వాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్క్రీన్ షేరింగ్ యాప్ వాడొద్దని సూచించింది.
స్క్రీన్ షేరింగ్ యాప్‌లు రిమోట్ సహాయం, పని వాతావరణంలో సహకారం కోసం ఉపయోగపడతాయి. అయితే కొన్ని ఫ్రాడ్ సంస్థలు కొన్నిసార్లు వాటిని ఇన్‌స్టాల్ చేసేలా వినియోగదారులను మోసగించవచ్చు. అలా చేయడం ద్వారా, వినియోగదారులు లావాదేవీలు చేస్తున్నప్పుడు వారు బ్యాంకింగ్ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంది. అందుకే గూగుల్ వాటితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఏ కారణం చేతనైనా థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేయమని లేదా ఇన్‌స్టాల్ చేయమని గూగుల్ పే మిమ్మల్ని ఎప్పుడూ అడగదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటికే మీరు ఈ స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఉంటే, మీరు గూగుల్ ని ఉపయోగించే ముందు, అవి మూసివేయబడి ఉన్నాయని నిర్ధారించుకోవాలని గూగుల్ కోరింది. ఎవరైనా తాము గూగుల్ పే ప్రతినిధిగా మీకు ఫోన్ గానీ లేదా డైరెక్ట్ గానీ పరిచయం చేసుకొని ఈ తరహా యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని మీకు సూచించినా చేయవద్దని.. ఒకవేళ చేసినా వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించింది.
ఈ యాప్‌లు వేరొకరి స్క్రీన్‌పై కార్యకలాపాలను గమనించడానికి మరొక వినియోగదారుని ఎనేబుల్ చేస్తాయి. పరికరాన్ని బట్టి నియంత్రణను కూడా తీసుకుంటాయి. కాబట్టి, మీకు తెలియకుండానే ఈ యాప్‌లలో ఒకదానిని ఇన్‌స్టాల్ చేయడానికి స్కామర్ మిమ్మల్ని మోసగించినట్లయితే మీరు దానిని గుర్తించవచ్చు. మీరూ యూపీఐ పిన్ వినియోగించినప్పుడు అది స్కామర్లకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల, ఈ రిమోట్ వీక్షణ, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల అవసరం లేకుంటే వాటిని ఉపయోగించకుండా ఉండాలి. అయితే, అవి మీ పనికి అవసరమైతే, లావాదేవీలు చేస్తున్నప్పుడు, బ్యాంకింగ్ డేటా, ఓటీపీలు, చూసేటప్పుడు వాటిని క్లోజ్ చేసేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..