Thunderstorm research centre: ఉరుములు, పిడుగులపై అధ్యయనానికి దేశంలో తొలి పరిశోధన కేంద్రం.. ఎక్కడంటే..?
ఉరుములు, పిడుగులపై దేశంలో తొలి పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
Thunderstorm research centre: ఉరుములు, పిడుగులపై దేశంలో తొలి పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ పరిశోధన కేంద్రాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ), ఇండియా వాతావరణ శాఖ (ఐఎండీ), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సహకారంతో ఏర్పాటు చేయనున్నారు.ఇది ప్రధానంగా బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలలో చురుకుగా ఉన్న కల్బాయిసాకి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఏటా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఉరుములు, పిడుగుల వల్ల అపార ప్రాణ నష్టం జరుగుతున్న నేపథ్యంలో ఐఎండీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. “ఉరుములతో కూడిన తుఫానులను అధ్యయనం చేయడానికి మేము బాలసోర్ వద్ద ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అధ్యయనం కోసం సమీప ప్రాంతాలలో కొన్ని అబ్జర్వేటరీలను ఏర్పాటు చేస్తాం. అధ్యయనం ఫలితాలు మోడల్ రూపంలో నమోదు చేయబడతాయి. మేము ప్రధానంగా కల్బాయిసాకి అధ్యయనంపై ఫోకస్ పెట్టబోతున్నాం. దీని ప్రభావం సాధారణంగా బీహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలలో గుర్తించాం” అని చెప్పారు.
ఈ కేంద్రంలో.. పూర్తి స్ధాయిలో పరిశోధనా నెట్‌వర్క్‌లు, రాడార్, ఆటో స్టేషన్, మైక్రోవేవ్ రేడియో మీటర్, విండ్ ప్రొఫైలర్ వంటి ఫెసిలిటీస్ ఉంటాయి. వాతావరణ శాఖకు సంబంధించిన ప్రయోగ వేదిక, క్షిపణి పరీక్ష వేదిక తరహాలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇక రుతుపవనాలపై పరిశోధన కోసం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో ఓ ప్రయోగ వేదికను ఏర్పాటు చేయాలని కూడా భారత వాతావరణ విభాగం సమాలోచనలు చేస్తోంది.