పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే మార్కెట్‌లోకి ఎన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నా.. వాటిలో ఉన్న ప్రధాన సమస్య చార్జింగే. ఎక్కడంటే అక్కడ చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లేకపోవడం వీటికి పెద్ద మైనస్. ఈ సమస్య వల్లే వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు కాస్త వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా హ్యూందాయ్ మోటార్స్ కి చెందిన లగ్జరీ కార్ల తయారీ దారు జెనెసిస్ ఓ కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. అదే వైర్ లెస్ చార్జింగ్ టెక్నాలజీ. కారును పార్క్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా చార్జ్ అయ్యే సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం దీనిపై విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ వైర్ లెస్ చార్జింగ్ విధానాన్ని మార్కెట్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
హ్యాందాయ్ కు చెందిన జెనెసిస్ కంపెనీ ఈ వైర్ లెస్ టెక్నాలజీపై ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తోంది. కోరియాలోని ప్రీమియం మార్కెట్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. 2023 జూన్ వరకూ ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఇది స్మార్ట్ ఫోన్లకు వాడే వైర్ లెస్ చార్జింగ్ విధానానికి దగ్గరగా ఉంటుంది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన ప్యాడ్ ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ ప్యాడ్ నుంచి మ్యాగ్నటెక్ ఫీల్డ్ సాయంతో కారు వైర్ కనెక్షన్ లేకుండానే చార్జ్ అవుతుంది. ఈ ప్యాడ్ కింద భూమిలో ఉంచుతారు. ఈ ప్యాడ్ పై కారును పార్క్ చేసినప్పుడు ఆ చార్జింగ్ ప్యాడ్ నుంచి కారుకు విద్యుత్ శక్తి అందుతుంటుంది.
రానున్న కాలంలో ఇటువంటి ఎలక్ట్రిక్ ప్యాడ్లను 11కిలోవాట్ల సామర్థ్యంతో 20 వరకూ ఇన్ స్టాల్ చేయాలని జెనెసిస్ కంపెనీ భావిస్తోంది. వీటిని టెస్ చేయడానికి జీవీ60, జీవీ70 అనే రెండు కార్లను కూడా ఆధునిక సాంకేతికతతో కూడిన రిసీవర్లను అమర్చింది. ఈ సందర్భంగా జెనెసిస్ ప్రాడక్ట్ హెడ్ మార్క్ చాయ్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ ను వీలైనంత వేగంగా, సులభంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 11 కిలోవాట్ల సామర్థ్యంతోనే ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయని, దీనిని మరింత పెంచే విధంగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..