
చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం చంద్రయాన్ -3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయోగం కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం భూమి చుట్టూ పలుమార్లు తిరిగిన చంద్రయాన్ -3 ఎట్టకేలకు విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే జులై 14న ప్రయోగించిన చంద్రయాన్ – 3 చంద్రుని దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే చంద్రయాన్ – 3 భూమి చుట్టు కక్షలను విజయవంతగా పూర్తి చేసుకున్న అనంతరం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. అయితే చంద్రుని వైపు వెళ్తున్న ఈ వ్యోమనౌక ఇప్పటికే ముడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నట్లు శుక్రవారం రోజున ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఆగస్టు 23వ తేదిన చంద్రునిపై ఈ ల్యాండర్ అడుగుపెట్టనుంది.
ప్రస్తుతం ఈ వ్యోమనౌక పనితీరు బాగానే ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుని కక్ష్యలోకి వెళ్లిన తర్వాత.. ఆ కక్ష్యలో తిరుగుతుందని.. ఈ నెల 23న చంద్రునిపైనా దీన్ని ల్యాండ్ చేస్తామని పేర్కొ్నారు. అయితే చంద్రునిపై దిగే సమయంలో ఈ విక్రమ్ ల్యాండర్ తన సొంతంగానే నిర్ణయాలను తీసుకుంటుందని ఇస్రో తెలిపింది. వాస్తవానికి చంద్రయాన్ -2 లోని విక్రమ్ ల్యాండర్‌కు అలాగే చంద్రయాన్ – 3 లోని విక్రమ్ ల్యాండర్‌కు ఇదే ప్రధానమైన తేడా అని చెప్పింది. గతంలో చంద్రయాన్ – 2 విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మిషన్ చంద్రునిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీకొంది. దీంతో చివరికి ఆ విక్రమ్ ల్యాండర్‌లో ఉన్న వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. అయితే ఇప్పుడు మాత్రం ల్యాండర్‌ను మెరుగ్గా అభివృద్ధి చేసి జాబిల్లి పైకి పంపింది ఇస్రో.
ప్రస్తుతం చంద్రుని కక్ష్యలోని వ్యోమనౌక ప్రవేశించింది కాబట్టి దాని చుట్టు పరిభ్రమిస్తూ తన కక్ష్యను తగ్గించుకుంటుంది. ఆ తర్వాత చివరికి చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మరో విషయం అంటంటే చంద్రునిపై ఈ నౌక మొత్తం ల్యాండ్ కాకుండా విడిపోతుంది. కేవలం విక్రమ్ ల్యాండర్ మాత్రమే చంద్రనిపై ల్యాండ్ అయ్యేలా చేస్తుంది. ఇదిలా ఉండగా పలు దేశాలు చంద్రునిపై తమ తమ ఆవిష్కర్ణలను పంపించినప్పటికీ.. చంద్రయాన్ – 3 మాత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపైన మొదటిసారిగా ల్యాండ్ కానుంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి మంచు ఉనికిని చంద్రయాన్ 1 గుర్తించింది. ఈ ఆధారంగానే చంద్రయాన్ – 3 ఆ ప్రాంతంలో దిగి సర్వేలు చేపట్టనుంది. గతంలో ఎదురైన పొరపాట్ల నుంచి పలు విషయాలు నేర్చుకొని ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు ఇస్రో తెలిపింది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతగా ల్యాండ్ అయితే.. ఈ ప్రయోగం చేపట్టిన అమెరికా, చైనా, రష్యాల తర్వాత నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.