Blue Origin Spaceflight Today: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’కు చెందిన ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌకలో మంగళవారం అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా ఈ యాత్ర సాగుతుంది. చంద్రుడిపై మానవుడు తొలిసారిగా కాలుమోపిన రోజునే ఈ చరిత్రాత్మక యాత్ర కోసం బెజోస్ ఎంచుకున్నారు. అయితే పశ్చిమ టెక్సస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమాన ప్రకారం) న్యూ షెపర్టు దూసుకెళ్లనుంది. ఆయన వెంట ప్రపంచంలోనే అత్యంత పెద్ద, చిన్న వయసు వ్యోమగాములు కూడా ఉన్నారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ఇటీవలే విజయవంతంగా అంతరిక్ష యాత్రకు వెళ్లి వచ్చారు.
అయితే ఈ అంతరిక్షయానం చేసే ఉద్దేశం తొలుత ఆయనకు లేదు. బెజోస్ తన యాత్ర గురించి ప్రకటన చేయగానే బ్రాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార ప్రత్యర్థి కన్నా ముందుండాలనే ఉద్దేశంతో జూలై 11న యాత్ర చేపట్టారు. దీంతో స్వీయ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లొచ్చిన తొలి బిలియనీరుగా ఆయన గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో బెజోస్ యాత్ర నిర్వహిస్తున్నారు.
సబ్-ఆర్బిటల్ యాత్రల విషయంలో ప్రత్యర్థి సంస్థ కన్నా ఒక మెట్టు పైన ఉండేలా ‘న్యూ షెపర్డ్’ యాత్ర సాగనుంది. బ్రాన్సన్ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.. భూమి నుంచి సుమారు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న విషయం తెలిసిందే. బెజోస్ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లనుంది. అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది.
దీన్ని ప్రామాణికంగా తీసుకుని బ్రాన్సన్ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లి వచ్చారు. అయితే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (ఎఫ్‌ఏఐ) మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది. ఈ నేపథ్యంలో తమ అంతరిక్షయాత్రపై ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా చూసేందుకు 100 కిలోమీటర్లను దాటి వెళ్లనున్నట్లు బ్లూ ఆరిజిన్ పేర్కొంది. ‘న్యూ షెపర్డ్’ పూర్తిగా స్వయంచోదిత వ్యోమనౌక. అందువల్ల పైలట్ల అవసరం ఉండదు. ఈ యాత్రకు బెజోస్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మహిళా పైలట్ వేలీ ఫంక్ (82) ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. 18 ఏళ్ల ఆలివర్ డేమన్.. అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు. బెజోస్ సోదరుడు మార్క్ కూడా యాత్ర చేయనున్నారు.
Safety is and will always be our top priority. Hear from Gary Lai and Laura Stiles about our approach to safety and reliability. Watch the #NSFirstHumanFlight launch live on https://t.co/7Y4TherpLr pic.twitter.com/xiHJpOyQ2p
— Blue Origin (@blueorigin) July 19, 2021