Password Alert: పాస్ వర్డ్ విషయంలో మీరు ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు

|

Mar 13, 2022 | 6:36 AM

Password Alert: టెక్నాలజీ పరంగా ప్రపంచ దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలు పోటీ పడి మరీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.

Password Alert: పాస్ వర్డ్ విషయంలో మీరు ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు
Password
Follow us on

Password Alert: టెక్నాలజీ పరంగా ప్రపంచ దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలు పోటీ పడి మరీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఒక దేశ అభివృద్ధి చెందింది అనడానికి సాంకేతిక వృద్ధి కూడా ఒక పరిగణాంశంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో.. దాని వల్ల జరిగే అనర్థాలు కూడా అంతేస్థాయిలో పెరుగుతున్నాయి. టెక్నాలజీ మంచికి ఎంత ఉపకరిస్తుందో.. చెడుకు కూడా అంతే దోహదపడుతోంది. అవును.. ప్రస్తుత కాలంలో టెక్నాలజీని మంచి కోసం కంటే చెడు కోసమే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి.. పెద్ద పెద్ద ధనవంతుల నుంచి సామాన్య ప్రజలను సైతం దోచుకుంటున్నారు కేటుగాళ్లు.

ప్రస్తుత టెక్ యుగంలో.. ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం అరచేతిలో ఇమిడిపోయే ఫోన్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఏ అవసరమైనా సరే టెక్నాలజీపైనే ఆధారపడిపోతున్నారు ప్రజలు. వ్యక్తిగత ఫోటోలు, ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన వివరాలు, బ్యాంకు డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా ప్రతి దానికి సంబంధించిన సమాచారం ఫోన్‌లో ఉంటుంది. అయితే, ఇదే కొందరు సైబర్ నేరగాళ్లకు ఆసరాగా మారుతుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో.. దాన్ని అందిపుచ్చుకోవడంలో సైబర్ నేరగాళ్లు ఒక అడుగు ముందే ఉంటున్నారు. టెక్నాలజీకి టెక్నాలజీతోనే చిల్లు పెడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ కేటుగాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి ఫోన్లకు, మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్, ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్స్, సాంకేతిక పరికరాలు ఒకటేంటి అన్నింటికీ పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటున్నాం.

కానీ, ఆ పాస్‌వర్డ్‌లను సైతం కనిపెట్టి.. దోచేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ నేపథ్యంలో సైబర్ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అవసరమైన వాటికి పాస్‌వర్డ్‌లు స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలని హితవుచెబుతున్నారు. లేదంటే అసలుకే మోసం అవుతుందని హెచ్చరిస్తున్నారు. చాలా మంది తమ పాస్‌వర్డ్ చాలా స్ట్రాంగ్ అని ఫీలవుతుంటారు. కానీ, సైబర్ నేరగాళ్ల దృష్టి పడనంత వరకే అది స్ట్రాంగ్.. లేదంటే అంతే సంగతులు. సాధారణంగా ప్రజలు కొన్ని సంఖ్యలు, చిహ్నాలు, లెటర్స్ ద్వారా పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకుంటారు. ఇలా కాకుండా సింపుల్‌గా పాస్‌వర్డ్స్ పెట్టుకుంటే మాత్రం కొంప కొల్లేరయినట్లే.

వర్జీనియాలోని యూఎస్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ హైవ్ సిస్టమ్స్ ప్రకారం.. సింపుల్‌ పాస్‌వర్డ్‌లను దాదాపు 39 నిమిషాల్లోనే చేధిస్తారట సైబర్ నేరగాళ్లు. మరి స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. బిగ్, స్మాల్, సింబల్స్‌ కలయికతో పెట్టే 18 అక్షరాల పాస్‌వర్డ్‌ను 438 ట్రిలియన్ సంవత్సరాల వరకు కూడా బ్రేక్ చేయలేరని ఈ కంపెనీ వారు పేర్కొంటున్నారు. 11 అక్షరాల పాస్‌వర్డ్‌ను 34 సంవత్సరాలలో క్రాక్ చేయొచ్చని పరిశోధనా నివేదికలో పేర్కొన్నారు. ఈ హైవ్ సిస్టమ్స్ 2022 కోసం కలర్-కోడెడ్ టేబుల్‌ను తయారు చేసింది. ఇది వినియోగదారుల పాస్‌వర్డ్‌లు నిజంగా ఎంత సురక్షితమైనవో చూపిస్తుంది.

టాప్-టైర్ గ్రాఫిక్స్ కార్డ్‌తో డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను ఉపయోగించి మీ పాస్‌వర్డ్ హ్యాష్‌ను క్రాక్ చేయడానికి హ్యాకర్ ఎంత సమయం తీసుకుంటారనే దాని ఆధారంగా దాని డేటా ఉందని కంపెనీ తెలిపింది. ఒకవేళ మీరు బహుళ సైట్‌లలో ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే.. చాలా సులభంగా హ్యాకింగ్‌కు గురవుతారని హైవ్ సిస్టమ్స్ పేర్కొంది. దొంగిలించిన పాస్‌వర్డ్‌లను రక్షించే సాంకేతికత, వన్ వే అల్గారిథమ్‌ను హ్యాకర్లు ఎలా రౌండప్ చేస్తారో కూడా సంస్థ పేర్కొంది.

పాస్‌వర్డ్‌ల విషయంలో.. హ్యాష్ అనేది మీ పాస్‌వర్డ్‌ను తెలుపుతుంది. ఉదాహరణకు, MD5 సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి ‘పాస్‌వర్డ్(Password)’ అనే పదాన్ని హ్యాష్ చేస్తే అవుట్‌పుట్ ‘‘5f4dcc3b5aa765d61d8327deb882cf99’’ అవుతుంది. మీరు వెబ్‌సైట్‌లలో ఉపయోగించే పాస్‌వర్డ్‌లు ‘Password’ వంటి సాదా వచనంలో కాకుండా సర్వర్‌లలో హ్యాష్‌లుగా నిల్వ చేయబడతాయి. తద్వారా ఎవరైనా వాటిని వీక్షిస్తే, సిద్ధాంతపరంగా, వారికి అసలు పాస్‌వర్డ్ తెలియదు.

‘పాస్‌వర్డ్’ కోసం ఇచ్చిన ఉదాహరణలో, హ్యాకర్ 5f4dcc3b5aa765d61d8327deb882cf99ని మాత్రమే చూస్తాడు. ‘పాస్‌వర్డ్’ అనే పదాన్ని తెలుసుకోవడానికి, ఈ హాష్‌ని రివర్స్ చేయడం అసాధ్యం. కానీ, హ్యాకర్లు మీ కీబోర్డ్‌లోని అన్ని అక్షరాల కలయికల జాబితాను రూపొందిస్తారు. తద్వారా హ్యాష్ చేస్తారు. దొంగిలించిన పాస్‌వర్డ్‌ల నుండి ఈ జాబితా, హ్యాష్‌ల మధ్య సరిపోలికలను కనుగొనడం ద్వారా, హ్యాకర్‌లు వినియోగదారు యొక్క నిజమైన పాస్‌వర్డ్‌ను గుర్తించగలరు, తద్వారా వివిధ వెబ్‌సైట్‌ల కోసం మీ లాగిన్‌లను యాక్సెస్ చేయడానికి వారిని అనుమతిస్తుంది.

‘‘HaveIBeenPwned నివేదిక ప్రకారం మేము 2007 నుండి ఇప్పటి వరకు పాస్‌వర్డ్ డేటా ఉల్లంఘనలను సమీక్షించాం. దాడి చేసేవారు వాస్తవానికి ఏం ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. కాలక్రమేణా అది మారుతుందో లేదో చూడటానికి ప్రయత్నించాం.’’ అని హైవ్ సిస్టమ్స్ తెలిపింది. ‘సాధారణంగా చెప్పాలంటే.. ఫోరమ్‌లు, రెస్టారెంట్‌లకు చెందిన వ్యక్తులు తక్కువ శ్రద్ధ వహించే వెబ్‌సైట్ లాగిన్‌లు MD5, SHA-1ని ఉపయోగించాయి. వాటినే కొనసాగిస్తున్నాయి. బ్యాంకింగ్, ప్రభుత్వం, ప్రైవేట్ మెసేజింగ్, ఇమెయిల్, సోషల్ మీడియా వంటి సైట్‌లలో ప్రజలు అదే పాస్‌వర్డ్‌లను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారు. ఇది దారుణమైన విషయం.’’ అని పేర్కొంది.

తాజా పరిశోధనల ప్రకారం.. ప్రత్యేకమైన అక్షరం, సంఖ్యల కలయికతో మరింత సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని ప్రజలకు సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గత నెలలో లండన్‌కు చెందిన కార్డ్ మెషిన్ ప్రొవైడర్ డోజో.. యూపీ ప్రభుత్వ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) నుండి 1,00,000 ఉల్లంఘించిన పాస్‌వర్డ్‌లపై డేటాను విశ్లేషించింది. ఇది ‘123456’, ‘qwerty’, ‘Password’ లను కనుగొంది. ఇవన్నీ చాలా సులభంగా గుర్తుపెట్టుకునే, కనిపెట్టగలిగే పాస్‌వర్డే కావడం విశేసం. ఇక పెంపుడు జంతువుల పేర్లు, ప్రేమకు సంబంధించిన పేర్లు, ‘లవ్’, ‘బేబీ’, ‘ఏంజెల్’ తో సహా జంతువుల, రంగుల వంటి సాధారణ పేర్లను పెట్టుకున్నారని, ఇవన్నీ కూడా చాలా సులభంగా హ్యాకింగ్‌కు గురయ్యాయని గుర్తించారు.

డోజో లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ నవీద్ ఇస్లాం.. ‘‘చాలా మంది ప్రజలు సాధారణ పాస్‌వర్డ్‌లను పెడుతున్నారు. ఇది ప్రమాదకరం అని పేర్కొన్నారు. బహుళ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం, ఆలోచించడం సమస్యల కారణంగా చాలా మంది సింపుల్ పాస్‌వర్డ్‌లను పెడుతున్నారు. కానీ, హ్యాకర్లు ప్రసిద్ధ కోపింగ్ స్ట్రాటజీలను ఉపయోగించుకుని, ప్రజలకు హానీ తలపెట్టే అవకాశం ఉంది.’’ అని హెచ్చరించారాయన.

పాస్‌వర్డ్ మేనేజర్ ప్రొవైడర్ లాస్ట్ పాస్‌లో ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ డాన్ డెమిచెల్ బలమైన పాస్‌వర్డ్‌లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సైబర్ దాడికి వ్యతిరేకంగా పాస్‌వర్డ్ ఉండాలంటే మొదటి పదమే అత్యంత శక్తివంతంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అనేది కనీసం 16 అక్షరాల పొడవు ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలతో పాటు సంఖ్యలు, చిహ్నాల మిశ్రమాన్ని పాస్‌వర్డ్‌గా సెట్ చేస్తే.. హ్యాక్ చేయడం ఎవరి తరం కాదని సైబర్ నిపుణులు పేర్కొన్నారు. అందుకే.. సైబర్ నేరగాళ్ల బారిన పడుకుండా ఉండేందుకు పాస్‌వర్డ్‌లను చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

బలమైన పాస్‌వర్డ్ కోసం చిట్కాలు..
1. ప్రత్యేక అక్షరాలు, సంఖ్యలు, పెద్ద అక్షరాల మిశ్రమాన్ని ఉపయోగించండి. పెద్ద, చిన్న అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాలు($ £ !)తో పాస్‌వర్డ్‌లను సురక్షితంగా, హ్యాక్ చేయడం కష్టతరం చేస్తుంది.
2. కనీసం 8-12 అక్షరాలతో పొడవైన పాస్‌వర్డ్‌ని లక్ష్యంగా పెట్టుకోండి. పాస్‌వర్డ్ ఎంత పొడవుగా ఉంటే అంత మంచిది. పొడవైన పాస్‌వర్డ్‌ల కలయికలను రూపొందించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. హ్యాకర్లు దీనిని హ్యాక్ చేయలేరు.
3. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఉపయోగించండి. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటే.. హ్యాకింగ్ చాలా కష్టం అవుతుంది.
4. పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్‌ని ఉపయోగించండి. ఒకటికి మించి ప్రత్యేక పాస్‌వర్డ్‌లను క్రియేట చేసేటప్పుడు వాటన్నింటినీ గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే పాస్‌వర్డ్‌లను రాసుకునే బదులు, మీ ఫోన్ నోట్స్‌లో ఈ పాస్‌వర్డ్‌లను సురక్షితంగా నిల్వ చేసే అనేక యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లు ఉన్నాయి. వాటిలో పాస్‌వర్డ్‌లను భద్రపరుచుకోవచ్చు.
6. మీ పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చుకోండి. మీ పాస్‌వర్డ్‌లను మార్చడం వల్ల మీ ఖాతాలు హ్యాకర్ల భారిన పడే ప్రమాదం తప్పుతుంది.

Also read:

Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

Telangana: అసెంబ్లీలో నవ్వులే నవ్వులు.. భట్టి విక్రమార్క కామెడీకి పడి పడి నవ్విన మంత్రి కేటీఆర్..

Andhra Pradesh: ఏపీలో షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగా ట్రైన్ కింద పడ్డ యువకుడు.. హడలెత్తిస్తున్న దృశ్యాలు..!