
ప్రస్తుతం ప్రపంచం ఇంటర్నెట్ గుప్పిట్లో ఉంది. ఎక్కడ ఏ మూలన ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా నిమిషాలలో సాధ్యమవుతుంది. విద్య, వినోదం, చదువు, వ్యాపారం ఇలా అన్ని విషయాల్లో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ఏది కావాలన్నా ఇంటర్నెట్లో వెతకడం, దానికి సంబంధించి సంస్థలను తెలుసుకోవడం, అక్కడి నంబర్లకు సంప్రదించడం ద్వారా మన పని చాలా సులభంగా పూర్తవుతుంది. దీనివల్ల సమయం, డబ్బులు ఆదా కావడంతో పాటు ఇంట్లోని ఉండి అన్ని పనులు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే సమయంలో నకిలీ వెబ్ సైట్లు, సైబర్ మోసగాళ్ల దాడులు కూడా ఎక్కువయ్యాయి. ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ ఖాతా బ్లాక్ అయ్యింది.. ఆధార్ వివరాలు చెప్పండి అంటూ ఫోన్లు వస్తున్నాయి. వాటిని నమ్మి మనం వివరాలు, ఓటీపీ నంబర్ చెప్పామో మన ఖాతాలో సొమ్ములు ఖాళీ అవుతున్నాయి. పెద్దగా చదువుకోని వారితో పాటు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
ఇలాంటి ఓ మోసమే ఇటీవల వెలుగు చూసింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరే సైబరాసురుల చేతికి చిక్కి.. ఏకంగా రూ. 1.38లక్షలు పోగొట్టుకున్నాడు. అతడిని చాలా తెలివిగా మోసం చేసి సొమ్ములు కాజేశారు సైబరాసురులు. విషయం అర్థమైన తర్వాత అతడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూణేకి చెందిన 71 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. వెంటనే ఆన్ లైన్ లో వెతకగా అతడికి ఓ వెబ్‌సైట్ కనిపించింది. దానిలో ఉన్న నంబర్ ను సంప్రదించి, తనకు ఎలక్ట్రిక్ బైక్ కావాలని అడిగాడు. వెంటనే ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ సిబ్బంది మంటూ కొందరు వాట్సాప్ లో చాటింగ్ చేశారు. రకరకాల బైక్ ల వివరాలు చెప్పారు. దానిలో ఒకదానికి ఎంపిక చేసుకున్నాక, డబ్బులు పంపాలని కోరారు. వారు చెప్పిన మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు రూ. 1,38,552 సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బదిలీ చేశాడు. తొందరలోనే బైక్ పంపిస్తామని వారు చెప్పారు. కానీ ఎంత కాలానికి బైక్ రాకపోవడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పాడు. పోలీసుల విచారణలో ఆ వెబ్ సైట్ నకిలీదిగా తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నకలీ వెబ్ సైట్ ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. కంపెనీల అధికారిక వెబ్ సైట్ లలో మాత్రమే ఆన్ లైన్ లో లావాదేవీలు చేయాలని కోరుతున్నారు. పెరిగిన టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉందో, సైబర్ మోసగాళ్ల కారణంగా కూడా భారీ నష్టం జరుగుతోందన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..