Womens Handball Premier League: క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షులు అరిశనపల్లి జగన్ మోహన్ రావు తెలిపారు. జైపూర్‌లో జరిగిన హెచ్ఎఫ్ఐ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పురుషుల హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ హక్కులను దక్కించుకున్న ‘ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థనే మహిళల హ్యాండ్ బాల్ లీగ్‌ను కూడా నిర్వహించనుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు జగన్ మోహన్ రావు చెప్పారు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా జనవరిలో వాయిదా పడ్డ పురుషుల హ్యాండ్ బాల్ లీగ్‌ను కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని వచ్చే రెండు నెలల్లో నిర్వహించనున్నామని, అది ముగియగానే మహిళల హ్యాండ్ బాల్ లీగ్‌ను కూడా నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ లీగ్స్‌తో దేశంలో హ్యాండ్ బాల్ కు మరింత క్రేజ్ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.