
క్రీడారంగంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఉన్నట్టుండి పిడుగుపడటంతో ఒక ఫుట్‌బాల్ ఆటగాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. థాయ్‌లాండ్‌లోని నరాతివాట్ ప్రావిన్స్, సుంగై గోలోక్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంగై గోలోక్ మైదానంలో గోలోక్ ఎఫ్‌ఏ కప్ 2026 రీజినల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మ్యాచ్ సాగుతున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా క్షీణించి, భారీ శబ్దంతో పిడుగు నేరుగా మైదానంపై పడింది. ఈ ప్రమాదంలో యాలా ఎఫ్‌సీ క్లబ్‌కు చెందిన 24 ఏళ్ల థాయ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సోఫ్వాన్ అవాయ్ మరణించాడు. పిడుగుపడిన వేగానికి మైదానంలో ఉన్న మరో 12 మంది క్రీడాకారులు స్పృహ తప్పి పడిపోయారు.
ఘటన జరిగిన వెంటనే మ్యాచ్ నిర్వాహకులు, తోటి ఆటగాళ్లు స్పందించి గాయపడిన వారందరినీ హుటాహుటిన సమీపంలోని సుంగై గోలోక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన 12 మందికి అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆటలో గెలిచి తమ ప్రతిభను చాటుకోవాలనుకున్న యువ క్రీడాకారుడు ఇలా పిడుగుపాటుకు బలవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. థాయ్‌లాండ్ క్రీడా ప్రపంచం ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
🇹🇭 Horrifying moment from Thailand when a freak lightning strike kills a football player and injures 12 others during a match pic.twitter.com/lAwYJxhtUo
— Visegrád 24 (@visegrad24) August 5, 2026