
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పాలష్ ముచ్చల్ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్న వేళ.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధానకి అకస్మాత్తుగా హార్ట్‌అటాక్ రావడంతో పెళ్లి వేడుకను వాయిదా వేయాలని కుటుంబం నిర్ణయించింది. సంగ్లీ జిల్లా సాందోల్‌లోని మంధాన ఫార్మ్‌హౌస్ వద్ద వివాహ ఏర్పాట్లు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. స్మృతి కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలోనే చికిత్స పర్యవేక్షిస్తున్నారు.
స్మృతి మంధాన బిజినెస్ మేనేజర్ తుహిన్ మిశ్రా ఈ విషయాన్ని ధృవీకరించారు. కుటుంబ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వివాహ వేడుకలను తక్షణమే రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఫార్మ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన అలంకరణలను సిబ్బంది తొలగించే పనులు ఇప్పటికే ప్రారంభించారు.
నవంబర్ 23న సన్నిహితుల మధ్య వివాహం జరగనుండగా, దేశం నలుమూలల నుంచి పలువురు అతిథులు సంగ్లీకి చేరకున్నారు. మహిళల ప్రపంచకప్ విజేత జట్టు నుంచి పలువురు క్రికెటర్లు కూడా స్మృతితో కలిసి ఉన్నారు. గత కొన్ని రోజులుగా స్మృతి, పాలష్‌ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి.
శ్రీనివాస్ మంధానకి ఆరోగ్యం నిలకడగాఉండటంతో కుటుంబం ఊపిరి పీల్చుకున్నప్పటికీ, వివాహం ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం కుటుంబసభ్యులు గోప్యత కోరుతూ, పూర్తిగా శ్రీనివాస్ మంధాన ఆరోగ్యపరంగా కోలుకోవడంపై దృష్టి పెట్టారు.