వెస్టిండీస్ పర్యటనకు టీమిండియాను ఎంపిక చేశారు. ముందుగా అనుకున్నట్టే బీసీసీఐ సెలక్టర్లు యువకులకు పెద్దపీట వేశారు. మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ అవకాశం కల్పించారు. అంతేకాకుండా నవదీప్ సైనీ, రాహుల్ చాహర్ వంటి కొత్తవారితో అరంగేట్రం చేయించనున్నారు. అయితే టెస్టు, వన్డే, టీ20 జట్లకు విరాట్ కోహ్లీనే సారథిగా ప్రకటించడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాది, ఐపీఎల్‌లో నాలుగు ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మకు సారథ్యం ఎందుకు అప్పగించడం లేదని ట్విటర్‌లో ప్రశ్నిస్తున్నారు. ఇదేదో చినికి చినికి గాలివానగా మారేలా కనిపిస్తోంది. పైగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
కాగా… కోహ్లీ సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఓడింది. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో కివీస్ చేతిలో పరాజయం పాలైంది. గెలిచే సత్తా ఉన్నప్పటికీ కోహ్లీ ఏం చేయలేకపోతున్నాడని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విరాట్ ఒక్కసారీ విజేతగా నిలపలేకపోవడం గమనార్హం.
అయితే…ఐపీఎల్ లో అత్యుత్తమ సారథి రోహిత్ శర్మ. ముంబయి ఇండియన్స్‌ను నాలుగు సార్లు విజేగా నిలిపాడు. జట్టులో అందరినీ గౌరవిస్తాడు. కోచ్, మెంటార్ చెప్పిన పనిని చెప్పినట్టు చేస్తాడు. కీలక సమయాల్లో బౌలర్లను ఉపయోగించడంలో దిట్ట.